పోలింగ్ శాతం పెరగడంపై అనుమానాలున్నాయి

పోలింగ్ శాతం పెరగడంపై అనుమానాలున్నాయి

నిజామాబాద్‌లో పోలింగ్ శాతం పెరగడంపై అనుమానాలున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర సీఈవో రజత్ కుమార్‌ను కలిసిన పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'నిజామాబాద్ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇది చాలా పెద్ద విషయం. పోలింగ్ శాతం పెరగడంపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఆ మిషన్‌ని మళ్ళీ కౌంట్ చేయాలని కోరాం. కొన్ని మిషన్లు స్ట్రాంగ్ రూమ్‌కి రావడంలో ఆలస్యం జరిగింది. స్ట్రాంగ్ రూమ్‌లో నెలకొన్న ఇబ్బందులు దృష్ట్యా.. తమ ప్రతినిధులను సెక్యురిటీగా పెట్టుకోవడానికి అనుమతి కోరాం. అయితే కొంత పరిధిలో పెట్టుకోవచ్చని, అయితే కేంద్ర బలగాలు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదని అన్నారు. ఉపయోగం లేని ఈవీఎంలు సీజ్ చేస్తామని తమకు కలెక్టర్ నుంచి ఫోన్లు వస్తున్న విషయాన్ని సీఈవో దృష్టికి తీసుకొచ్చాం. 48 గంటల తరువాత ఉపయోగం లేని ఈవీఎంలు ఎందుకు బయట ఉన్నాయో చెప్పాలి. వీటి అన్నింటిపై ఆర్టీఐ ద్వారా వివరాలు అందిస్తామని సీఈవో తమతో తెలిపారు. వీటన్నింటిపైనా ఆర్వో ద్వారా వివరాలు అందిస్తామని అన్నారు. నిజామాబాద్ లో 6గంటల వరకు పోలింగ్ సాగింది. దానిపై పోలింగ్ శాతం సరిగా రాలేదు' అని అరవింద్ చెప్పారు.