సెంచరీ దాటేస్తామంటున్న కేసీఆర్

సెంచరీ దాటేస్తామంటున్న కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ వంద సీట్లకు పైగా గెల్చుకోవడం ఖాయమని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పార్టీ పరిస్థితి... దేశ, రాష్ట్ర రాజకీయాలు, టీఆర్ఎస్ పనితీరు వంటి అనేక అంశాల మీద కూలంకషంగా చర్చించామని, ఈ మేరకు 9 తీర్మానాలు కూడా ఆమోదించామని కేసీఆర్ చెప్పారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి ప్రగతి సభ అని నామకరణం చేశామన్నారు. ఆ బహిరంగ సభకు 20 లక్షల మందిని తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా రూ. 20 వేల కోట్ల నిధులైనా కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించినట్లు చెప్పారు. వరి, మొక్కజొన్న పంటల మద్దతు ధరను క్విటాలుకు రూ. 2 వేలు పెంచాలన్నారు. సెప్టెంబర్ నుంచి దశలవారీగా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. 

చట్టాలు అందరికీ ఒకలాగే ఉండాలని, తమిళనాడులో ఒకలాగా, మనకొకలాగా ఎందుకు ఉండాలంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎస్టీలు, మైనారిటీ రిజర్వేషన్లలో అన్యాయం జరిగింది కాబట్టి ఆ విషయంలో నిర్ణయం తమకే వదిలేయాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. విద్య, హెల్త్, రూరల్ డెవలప్ మెంట్ వంటి అంశాల్లో నిర్ణయాలను రాష్ట్రాలకే వదిలేయాలని ఇటీవల జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో తాను కుండబద్దలు కొట్టినట్లు కేసీఆర్ చెప్పారు. 

తాను ఫెడరల్ ఫ్రంట్ విషయంలో చాలా క్లారిటీ కలిగి ఉన్నాని చెప్పారు. దేశంలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండూ దారుణంగా విఫలమయ్యారన్నారు. ఒకటి, రెండు పార్టీలను పోగేసి ప్రయోజనాలు నెరవేర్చుకునే చేసి చిల్లర రాజకీయాలు తాను చేయడం లేదన్నారు. 120 కోట్ల మంది భారతీయుల ఆశలు నెరవేర్చడంలో ఆ రెండు పార్టీలు విఫలమవడం వల్లే ఈ ప్రయత్నానికి పూనుకున్నట్లు చెప్పారు.