ఏపి శకటానికి కేంద్రం నో ..

ఏపి శకటానికి కేంద్రం నో ..

రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం ప్రదర్శన పైన కూడా ప్రధాని మోడీ అక్కసు పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్‌ శకటం ఎంపిక కాలేదు. గాంధీజీ జీవితంతో సంబంధం ఉన్న ఇతివృత్తాలతో వాటికి రూపకల్పన చేయాలని కేంద్ర రక్షణశాఖ గత ఆగస్టులో సూచించింది.  ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడ గాంధీకొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో డ్రాయింగ్స్‌ తయారు చేసి పంపింది. రక్షణశాఖ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఒప్పుకున్నాక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం త్రీడీ నమూనా, ఇతివృత్త సంగీతాన్ని రూపొందించింది. చివరి రౌండ్‌ వరకూ ఆంధ్రప్రదేశ్‌ నమూనా పోటీలో ఉంది. అయితే రక్షణశాఖ కమిటీ చివరకు దీన్ని ఎంపిక చేయలేదనడంతో అవాక్కైన ఏపీ భవన్‌ అధికారులు సిఎం దృష్టికి తెచ్చారు. ఏపి శకటానికి అనుమతివ్వకపోవడం కేంద్రంలోని బిజెపి కక్ష సాధింపునకు ఇది పరాకాష్ఠ అని చంద్రబాబు విమర్శించారు. శకటం ప్రదర్శనకు అనుమతి ఇవ్వక పోవడంపై లేఖ రాయాలని, కేంద్రం వివక్షతను బహిర్గతం చేయాలని పార్టీ నేతలతో  సీఎం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, అందుకే రాష్ట్రంపై అడుగడుగునా మోడీ కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.