కొత్త చార్జీలపై క్లారిటీ ఇచ్చిన జియో..

కొత్త చార్జీలపై క్లారిటీ ఇచ్చిన జియో..

తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకున్న రిలయన్స్ జియో.. ఆ తర్వాత టారీప్ ప్లాన్స్ తీసుకొచ్చినా.. క్రమంగా యూజర్లు పెరుగుతూ పోయారు. దీనికి డేతాతో పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా ఎంత సమయమైనా ఉచితంగా మాట్లాడుకునే వెసులుబాటు ఉండడమే ప్రాధాన కారణంగా చెప్పుకోవచ్చు. జియో దెబ్బకు మిగతా టెలికం సంస్థలు కూడా ఈ తరహా ప్లాన్స్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా మినహాయింపు కాకుండా పోయిన పరిస్థితి. అయితే, ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)పేరుతో చార్జీలు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది జియో. దీంతో జియో కాకుండా మిగతా నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని జియో తెలిపింది. ఇది ఈరోజు నుంచి అమల్లోకి వచ్చేసింది.. దీంతో వినియోగదారుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ ప్రకటన రాకముందే రీచార్జ్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి? అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఇవాళ దీనిపై క్లారిటీ ఇస్తూ మరో ప్రకటన విడుదల చేసింది జియో.

అక్టోబర్ 9 లేదా అంతకంటే ముందే రీచార్జ్ చేసుకున్నవారు ఈ ఐయూసీ చెల్లించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది రిలయన్స్ జియో.. నాన్-జియో నెంబర్లకు వారి ప్రస్తుత ప్లాన్ ముగిసే వరకూ ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చని స్పష్టత ఇచ్చింది. ఇక, నాన్-జియో నంబర్లకు కాల్ చేయడానికి, కొత్త ఐయూసీ టాప్-అప్ వోచర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వోచర్లు రూ. 10 నుంచి ప్రారంభమై రూ.100 వరకు ఉంటాయని ప్రకటించింది. ఇక, రూ.10 యొక్క ప్రతి వోచర్‌పై 1 జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నారు. మరోవైపు జియో యొక్క పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల నుంచి కూడా నిమిషానికి 6 పైసల చొప్పున వాయిస్ కాల్‌లకు వసూలు చేస్తారు. వారికి ఉచిత డేటా రూపంలో కూడా పరిహారం ఇవ్వబడుతుంది.