బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదుః సుప్రీం

బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదుః సుప్రీం

దేశంలో బాణాసంచా విక్రయాలపై నిషేదం లేదని సుప్రీంకోర్టు కాసేపటి క్రితం తీర్పు నిచ్చింది. విక్రయాలపై కొన్ని షరతులను కూడా విధించింది. ఆన్ లైన్ లో బాణా సంచా విక్రయాలను నిషేదించింది. ఈ కామర్స్ పోర్టల్స్ కు ఆన్ లైన్ లో బాణాసంచా విక్రయించవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ ను కాల్చాలని సూచించింది. దీపావళి రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి పదిగంటల లోపు బాణాసంచాను కాల్చాలని తెలిపింది. నూతన సంవత్సర, క్రిస్మస్ వేడుకల్లో రాత్రి 11.45 నుంచి 12.30 లోపు బాణా సంచా కాల్చాలని జస్టీస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం తీర్పు నిచ్చింది.

బాణాసంచా విక్రయాలను నిషేధించాలని సర్వోన్నత న్యాయస్ధానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బాణాసంచాపై నిషేధం విధించాలనే పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు తయారీదారుల ఉపాధి హక్కుతో పాటు దేశం‍లోని 130 కోట్ల మంది ఆరోగ్యంగా జీవించే హక్కు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు గతంలో పేర్కొంది. తమిళనాడులో 1750 బాణాసంచా తయారీ పరిశ్రమలున్నాయని, వీటిలో 5000 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయని కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా గత ఏడాది దీపావళికి ముందు అక్టోబర్‌ 9న ఢిల్లీలో బాణాసంచా విక్రయాలను తాత్కాలికంగా నిషేధించింది.