కనిపించని రూ.2 వేల నోటు..! కారణం ఇదేనా..?
పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్ల రద్దు తర్వాత... ఆర్బీఐ రెండు వేల నోటును చలామణీలోకి తీసుకొచ్చింది. పింక్ కలర్లో... చిన్న సైజులో ఉండే రెండు వేల నోటు అందరి చేతిలో తళతళలాడింది. కానీ... ఇప్పుడు అదే నోటు కానరాకుండా పోయింది. చూద్దామన్నా.. కనిపించకుండా పోతోంది. బ్యాంకుల్లో లేవు... ఏటీఎంల్లో కూడా 500, 100, 200 నోట్లు తప్ప... 2 వేల నోట్లు రావడం లేదు. ఇంతకూ రెండు వేల నోటు ఏమయినట్టు. డిపాజిట్ల రూపంలో వచ్చే నోట్ల కట్టల్లో కూడా రెండు వేల నోట్లు పెద్దగా కనిపించడం లేదంటున్నారు బ్యాంక్ అధికారులు. బ్యాంకుల నుంచి బయటకెళ్లిన రెండు వేల నోటు... తిరిగి బ్యాంకుకు చేరడం లేదు.
రెండు వేల నోటు పుట్టిందే దాచుకోడానికి అన్నట్టుంది. బ్లాక్ మనీని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం... ఫలించినట్టే అనిపించినా.. రెండు వేల నోటు తీసుకురావడం వరంగా మార్చుకున్నారు. 100 రూపాయలు, 200 నోట్లు, 500 నోట్ల కట్టల గుట్టలు పెట్టుకునే కంటే... రెండు వేల నోట్ల కట్టలు ఈజీగా దాచుకునేలా మారింది. రెండు వేల నోట్లు చేతికందడమే ఆలస్యం... వెంటనే బీరువాల్లోకి చేరాల్సిందే తప్ప బ్యాంకుల్లోకి కానీ.. వాడకంలోకి కానీ రావట్లేదు. ఆర్బీఐ రెండు వేల నోట్ల ముద్రణ నిలిపివేసింది. త్వరలో రెండు వేల నోట్ల రద్దు జరుగుతుందనే పుకార్ల అలజడి రేగినా.. రెండు వేల నోటు మాత్రం కట్టవీడి బయటకు రాలేదు. నల్లదనం జమ చేసుకునే వాళ్లంతా రెండు వేల నోటును బీరువా దాటి బయటకు వదలట్లేదు. దీంతో... రాను రాను రెండు వేల నోటు కనుమరుగవుతోంది. రెండు వేల నోటే కాదు... బ్యాంకుల్లో డిపాజిట్లు సైతం గణనీయంగా తగ్గాయంటున్నారు బ్యాంక్ అధికారులు. డబ్బులు ఇంట్లోనే దాచుకుంటున్నారు తప్ప.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదంటున్నారు. ట్యాక్స్‌లు కట్టాల్సి వస్తుందేమోనని... ఇల్లీగల్ మనీ అని ఎక్కడ తెలిసిపోతుందో అని ఇంట్లోనే భద్రపర్చుకుంటారని చెబుతున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)