2016కి ముందు ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ జరగలేదు

2016కి ముందు ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ జరగలేదు

సర్జికల్ స్ట్రైక్ పై దేశంలో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల సమయంలో ఈ అంశం మరింత పదునెక్కింది. తాజాగా రక్షణ మంత్రిత్వశాఖ యుపిఏ హయాంలో 6 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయన్ని అన్ని ప్రకటనలను తోసిపుచ్చింది. మంత్రిత్వశాఖ ప్రకారం 2016కి ముందు భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ కి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు.

జమ్ముకి చెందిన రోహిత్ చౌదరి ఆర్టీఐలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి వివరణ కోరారు. దీనికి జవాబుగా రక్షణ మంత్రిత్వశాఖ తమ దగ్గర కేవలం ఒకే సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించిన డేటా ఉందని, అది 29 సెప్టెంబర్ 2016లో ఉత్తర కశ్మీర్ లోని ఉరి ఉగ్రవాద దాడి తర్వాతదని చెప్పింది.

కాంగ్రెస్ ప్రజలకు సర్జికల్ స్ట్రైక్స్ గురించి అబద్ధాలు చెబుతోందని, యుపిఏ హయాంలో ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ జరగలేదని రోహిత్ చౌదరి ఆర్టీఐలో పేర్కొన్నారు. ఇటీవలే కాంగ్రెస్ తమ పరిపాలన కాలంలో 6 సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టు ప్రకటించింది. కాంగ్రెస్ చెబుతున్న ప్రకారం మొదటి దాడి 19 జూన్ 2008న జమ్ముకశ్మీర్ లోని పూంఛ్ లో ఉన్న భట్టల్ సెక్టర్ లో, రెండోది 30 ఆగస్ట్, 1 సెప్టెంబర్ మధ్య నీలమ్ నది తీరంలో ఉన్న శారదా సెక్టర్ లో జరిగాయి. 

ఒక సర్జికల్ స్ట్రైక్ 6 జనవరి 2013న సావన్ పత్రా చెక్ పోస్ట్ దగ్గర, ఒకటి 27, 28 జూలై 2013న నాజాపీర్ సెక్టర్ లో జరిగినట్టు కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా చెప్పారు. 6 ఆగస్ట్ 2013న నీలమ్ తీరంలో, 14 జనవరి 2014న మరో సర్జికల్ స్ట్రైక్ జరిగినట్టు ఆయన తెలిపారు.