రూ. 2 వేల నోట్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

రూ. 2 వేల నోట్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

రూ. వెయ్యి, పాత రూ.500 నోట్ల రద్దు తర్వాత వచ్చిన రూ.2 వేల నోటు.. మొదట్లో చిల్లరకు ఇబ్బంది పెట్టినా.. ఆ తర్వాత బాగానే చలామణిలోకి వచ్చింది. ఇక, ఆ తర్వాత రూ.2 వేల నోటుపై రకరకాల వార్తలు వచ్చాయి.. ఆ నోట్ల ముద్రణ నిలిపివేసింది ఆర్బీఐ. ఈ నోటు కూడా బ్యాన్‌ చేస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు.. అయితే.. దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. రూ. 2 వేల నోటు ముద్రణను నిలిపివేసే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటించింది. ఆర్థిక శాఖసహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. లావాదేవీలను సులభంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంకు నోట్ల ముద్రణపై ఆర్బీఐని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే నోట్ల ముద్రణకు సంబంధించి  దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఆర్‌బీఐ తెలిపిందని ఠాకూర్‌ వెల్లడించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ ప్రక్రియ దశలవారీగా  ప్రారంభమైందని తెలిపారు.