2024లో భారతదేశంలో ఎన్నికలే ఉండవు

2024లో భారతదేశంలో ఎన్నికలే ఉండవు

వివాదాస్పద బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2019లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలే దేశానికి చివరి ఎన్నికలని 2024లో దేశంలో ఇక ఎన్నికలనేవే ఉండబోవని వ్యాఖ్యానించారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ఉన్నావ్ ఎంపీ సాక్షి మహరాజ్ శుక్రవారం బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 2024లో దేశంలో ఇక ఎన్నికలనేవే ఉండబోవని చెప్పారు. 2014లో మోడీ ఉప్పెన ఉందని కానీ 2019లో మోడీ అనే ఒక సునామీ వస్తోందన్నారు. ప్రపంచంలోని ఏ శక్తీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోజాలదని స్పష్టం చేశారు. దీంతో కొంత మంది ఆందోళన చెందుతున్నారని అంటూ ఒకసారి ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి తీసుకొస్తారు, మరోసారి కూటమి కడతారని ఎద్దేవా చేశారు.

ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన నేత నరేంద్ర మోడీ అని సాక్షి మహరాజ్ ప్రశంసలు కురిపించారు. మోడీ ఉంటేనే దేశం ఉందని ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోందని చెప్పారు. మొట్టమొదటిసారిగా దేశంలో చైతన్యం కనిపిస్తోందన్నారు. హిందువులు మేల్కొన్నారని తెలిపారు. ప్రజలు నిద్ర వీడారన్నారు. 'నేను సన్యాసిని. మనసుకి ఏది తోస్తే అది చెప్తాను. ఈ ఎన్నికల తర్వాత 2024లో ఇక ఎన్నికలే ఉండవని నాకనిపిస్తోంది. కేవలం ఈ ఎన్నికల్లోనే దేశం పేరిట పోరాటం జరుగుతోందని' చెప్పారు.

ఇంతకు ముందు టికెట్ ఇవ్వకపోవచ్చనే వార్తలు రాగానే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ బీజేపీని బెదిరించారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర నాథ్ పాండేకి సాక్షి మహరాజ్ లేఖ రాశారు. ఇందులో తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.