మాల్యా ఆస్తులు బ్యాంకులకు అప్పగించేందుకు అభ్యంతరం లేదు

మాల్యా ఆస్తులు బ్యాంకులకు అప్పగించేందుకు అభ్యంతరం లేదు

విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తులను ఆయనకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్టియంకు అప్పజెప్పేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ప్రత్యేక కోర్టుకు తెలియజేసింది. అయితే భవిష్యత్తులో కోర్టు చట్టరీత్యా ఆ డబ్బు కట్టాల్సిందిగా ఆదేశిస్తే వారు ఆ మొత్తాన్ని వడ్డీతో సహా కడతామని బ్యాంకులు అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందని ఈడీ చెప్పింది. బ్యాంకుల కన్సార్టియం అభ్యర్థనకు జవాబిస్తూ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ఈ విధంగా అఫిడవిట్ ఇచ్చింది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మాల్యా ఆస్తులను వారికి అప్పగించాల్సిందిగా అప్పీల్ చేశాయి. బ్యాంకులకు రూ.9,000 కోట్లకు పైగా రుణం ఎగవేశాడనేది మాల్యాపై ఆరోపణ. బ్యాంకులు సుమారుగా రూ.6,200 కోట్లకు దావా వేశాయి.

ఈడీ ఏమంది?
ఈ కేసుని కోర్టు నిర్ణయానికి వదిలేసినట్టు ప్రత్యేక పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం) జస్టిస్ ఎం ఎస్ ఆజ్మీ ముందు సమర్పించిన అఫిడవిట్ లో ఈడీ పేర్కొంది. ఈ వ్యవహారంలో బ్యాంకుల అభ్యర్థనను అంగీకరించే నిర్ణయాధికారం కోర్టుకే ఉన్నట్టు తెలిపింది. కానీ ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా కోర్టు నగదుని తమ దగ్గర జమ చేయాల్సిందిగా కోరితే అప్పుడు బ్యాంకుల కన్సార్టియం వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కోర్టుకి కట్టేటట్లుగా అంగీకరిస్తూ అఫిడవిట్ ఇవ్వాలని కోరింది. ఒక్క బ్యాంక్ మినహా మిగతా అన్ని బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులేనని ఈడీ తెలిపింది. అందువల్ల వాళ్లు కోరుతున్న నగదంతా ప్రభుత్వానిదేనని చెప్పింది. ఆస్తుల అప్పగింత ప్రజాహితం కోసమేనంది.