ఎవరూ ఇటువంటి ఆరంబాన్ని కోరుకోరు : కోహ్లీ

ఎవరూ ఇటువంటి ఆరంబాన్ని కోరుకోరు : కోహ్లీ

ఐపీఎల్‌-12 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే డిపెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్‌ కింగ్స్‌ సమిష్టి కృషితో ఆకట్టుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. దీంతో సీఎస్‌కే తనకు ఎదురులేదని అన్ని జట్లకు హెచ్చరికలు పంపింది. అయితే మ్యాచ్‌ అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాట్లాడారు.

'లీగ్‌ మొదటి మ్యాచ్‌లోనే ఎవరూ ఇటువంటి ఆరంబాన్ని కోరుకోరు. అయితే మా పోరాటం సంతోషాన్నిచ్చింది. స్వల్ప స్కోర్‌ను సైతం కాపాడుకుంటూ మ్యాచ్‌ను 18వ ఓవర్‌ వరకు తీసుకెళ్ళాం. ఇది మాలో ఆత్మవిశ్వాసంను పెంచింది. మా బ్యాటింగ్‌ బాగా లేదు. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. తొలుత 140-150 పరుగులు చేస్తామనుకున్నాం, కానీ అది సాధ్యపడలేదు. లీగ్‌ను చెత్తగా ఆరంభించాం. ఓటమి గురించి ఆలోచించడం లేదు' అని విరాట్ తెలిపారు.

'గత నాలుగు రోజులగా పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. అయితే మేం బ్యాటింగ్‌ బాగా చేయాల్సింది. 110 - 120 పరుగులు చేస్తే.. పోరాడటానికి వీలుండేది. పేసర్‌ నవదీప్‌ షైనీ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. షైనీకి మంచి అవకాశం వచ్చింది. చెన్నై మా కన్నా అద్భుతంగా ఆడింది, వారు ఈ విజయానికి అర్హులు. మా జట్టు పోరాట పటిమ ఆకట్టుకుంది' అని విరాట్ చెప్పుకొచ్చారు.