బాలాకోట్ దాడిలో పాక్ సైనికులు, పౌరులు చనిపోలేదు

బాలాకోట్ దాడిలో పాక్ సైనికులు, పౌరులు చనిపోలేదు

ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రవాద దాడికి జవాబుగా భారతీయ వాయుసేన చేసిన వైమానిక దాడిలో పాకిస్థానీ సైనికులు కానీ, పౌరులు కానీ మరణించలేదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం ప్రకటించారు. పార్టీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ 2014లో మాదిరిగా సంపూర్ణ మెజారిటీ సాధించేందుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం కారణంగా మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఏం చేయాలనుకున్నారో అవేవీ చేయలేకపోయారని సుష్మా అన్నారు. భారతీయ వాయుసేన ఫిబ్రవరి 26న పాకిస్థాన్ లోని బాలాకోట్ ప్రాంతంలో జైషే మొహమ్మద్ కి చెందిన ఒక ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేసింది.

ఆత్మ రక్షణ కోసమే వైమానిక దాడి చేయాల్సి వచ్చిందని స్వరాజ్ అన్నారు. 'పుల్వామా దాడి తర్వాత మేం సరిహద్దు దాటి వైమానిక దాడి చేసి అంతర్జాతీయ సమాజానికి ఇది కేవలం ఆత్మరక్షణ కోసమే ఈ చర్య చేపట్టాల్సి వచ్చిందని వివరించాం' అని చెప్పారు. 'పాకిస్థానీ పౌరులు, సైనికులకు ఎలాంటి నష్టం కలగరాదని సాయుధ దళాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు మేం అంతర్జాతీయ సమాజానికి చెప్పామని' తెలిపారు. 'పుల్వామా దాడికి బాధ్యులైన జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేయాలని సైన్యాన్ని కోరినట్టు' సుష్మా చెప్పారు.