విదేశీ గడ్డపై టీమిండియా అష్ట కష్టాలు..!

విదేశీ గడ్డపై టీమిండియా అష్ట కష్టాలు..!

ప్రపంచకప్ ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా ఇప్పుడు ఇంగ్లీష్ గడ్డపై అష్టకష్టాలు పడుతోంది. మన క్రికెటర్లపై ఎంతో నమ్మకం పెట్టుకున్న బీసీసీఐ.. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత వారు తిరిగి ఇండియా చేరుకునే విధంగా టికెట్లు బుక్ చేయించింది. అయితే, అంచనాలు తలకిందులై సెమీస్‌లో ఇంటికి తిరుగుప్రయాణం కావాల్సి వచ్చింది. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైన కోహ్లీసేన.. భారత జట్టు ఫైనల్స్‌కు చేరుతుందనే ధీమాతో జట్టు యాజమాన్యం ఫైనల్స్‌ వరకూ ఇండియాకు టికెట్లు బుక్ చేయకపోవడంతో ఆటగాళ్లు ఈ నెల 14వ తేదీ వరకు ఇంగ్లండ్‌లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు పరాజయం చెందిన తర్వాత టికెట్లను సర్దుబాటు చేయడంలో బీసీసీఐ విఫలమైందనే ఆరోపణలున్నాయి. కొంతమంది తిరుగుప్రయాణం అయ్యేందుకు అవకాశం ఉన్నా.. చాలా మంది ఆటగాళ్లు ఈ  నెల 14వ తేదీ వరకు మాంచస్టర్‌లోనే ఉండి.. ఆ తర్వాత బయల్దేరుతారు. మెగా టోర్నీ ముగిసిన తర్వాతే తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నాయి బీసీసీఐ వర్గాలు.