మోడీ - అభిజిత్ బెనర్జీ.. మిమ్మల్లి ట్రాప్‌ చేస్తున్నారు..!

మోడీ - అభిజిత్ బెనర్జీ.. మిమ్మల్లి ట్రాప్‌ చేస్తున్నారు..!

నోబెల్ బ‌హుమ‌తి విజేత అభిజిత్ బెన‌ర్జీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి గెలుచుకున్న అభిజిత్ బెన‌ర్జీని ప్రధాని అభినందించారు. ఇక, అభిజిత్‌ను క‌ల‌వ‌డం అద్భుతంగా ఉంద‌ని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మాన‌వ సాధికార‌త కోసం క‌చ్చిత‌మైన ల‌క్ష్యాల‌తో అభిజిత్ ప‌నిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ భేటీలో అనేక అంశాల‌పై విస్తృత‌మైన‌, ఆరోగ్యక‌ర‌మైన చ‌ర్చ నిర్వహించామ‌న్నారు. అభిజిత్ సాధించిన ఘ‌న‌త ప‌ట్ల దేశం గ‌ర్వంగా ఫీల‌వుతుంద‌ని మోడీ అన్నారు. మరోవైపు ప్రధానితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు అభిజిత్.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు మీడియా నన్ను ఎలా ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుందనే దానిపై జోక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సంభాషణ ప్రారంభించినట్టు వెల్లడించారు. 

ఇక, ఆయన టీవీ చూస్తున్నాడు. మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఆయనకు తెలుసు. ఇండియా పట్ల తన ఆలోచనా విధానం గురించి ఆయన చెప్పాడన్న అభిజిత్ బెన‌ర్జీ.. దేశంపై ఆయన ఆలోచించే విధానం గురించి మాట్లాడటానికి నాకు చాలా సమయం ఇచ్చారని తెలిపారు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే పాలసీల గురించి ఒకరు వింటారు... కానీ, వాటి వెనుక ఉన్న ఆలోచన గురించి అరుదుగా వింటారు అని అభిజిత్ వెల్లడించారు. ముఖ్యంగా పాలనను తను చూసే విధానం గురించి ప్రధాని మాట్లాడినట్టె తెలిపారు. కాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బీజేపీ ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు అభిజిత్.. దీంతో కొంద‌రు బీజేపీ నేత‌లు ఆయనపై కూడా విమ‌ర్శలు గుప్పించారు. ఎటువంటి అవ‌కాశం లేక‌పోవ‌డం వ‌ల్ల ప్రజ‌లు నరేంద్ర మోడీని ఎన్నుకున్నార‌ని ఆయన వ్యాఖ్యానించడంపై బీజేపీ మండిపడింది. దీంతో.. ఇవాళ్టి భేటీలో నాపై వ్యతిరేకంగా మాట్లాడేందుకు మీడియా మిమ్మల్ని ట్రాప్ చేస్తుందంటూ చర్చ ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.