ట్రంప్‌కు షాక్‌.. ఉభయ కొరియాల భేటీ రద్దు

ట్రంప్‌కు షాక్‌.. ఉభయ కొరియాల భేటీ రద్దు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఉత్తరకొరియా షాక్‌ ఇచ్చింది. దక్షిణ కొరియాతో ఇవాళ జరగాల్సిన ఉన్నత స్థాయి చర్చలను రద్దు చేస్తున్నట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. అమెరికాతో కలసి దక్షిణ కొరియా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉత్తర కొరియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఉత్తరకొరియాను మాటలతో 'కంట్రోల్‌' చేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగలినట్టయింది. గత నెల ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఇవాళ భేటి జరగాల్సి ఉంది. ఈ చారిత్రక సదస్సులో అణు ఆయుధాల తొలగింపు, యుద్ధ విరమణ, శాంతి ఒప్పందాలపై చర్చించేందుకు ఇరు దేశాల ప్రతినిధులు ప్రణాళికలు రచించారు. ఈ సమావేశం రద్దవడంతో.. ఆ ప్రభావం చారిత్రాత్మక కిమ్- ట్రంప్ భేటీపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.