రివ్యూ : నోటా

రివ్యూ : నోటా

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహరీన్‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు

మ్యూజిక్ డైరెక్టర్: శ్యామ్ సిఎస్‌

కెమెరామెన్: శంతన్‌ కృష్ణ‌ణ్ ర‌విచంద్ర‌న్

నిర్మాత: కేఈ జ్ఞాన‌వేల్ రాజా

ద‌ర్శ‌కత్వం: ఆనంద్ శంక‌ర్

రిలీజ్ డేట్: 05-10-2018

పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ గా కనిపించిన విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హోదాను సంపాదించుకున్నాడు.  గీత గోవిందంతో క్యూట్ హీరోగా మార్కులు కొట్టేసిన విజయ్ ఇప్పుడు యువ ముఖ్యమంత్రి నోటాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈరోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.  

కథ : 

విజయ్ దేవరకొండ లండన్ లో పెరిగిన వ్యక్తి.  విజయ్ తండ్రి నాజర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.  కొడుకును దూరంగా లండన్ ఉంచుతాడు.  వీడియో గేమ్స్ అంటే విజయ్ కు ఇష్టం.  సంవత్సరానికి ఓ మారు ఇండియా వస్తుంటాడు.  అలా సొంత రాష్ట్రానికి వచ్చిన విజయ్ అనుకోకుండా  ముఖ్యమంత్రి పదవిని చేపట్టవలసి వస్తుంది.  తండ్రి నుంచి ఆ ముఖ్యమంత్రి పదవిని పొందిన విజయ్ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాడు..? విజయ్ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి..? అన్న ప్రశ్నల సమూహారమే నోటా. 

విశ్లేషణ : 

ఒక అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తి.. తరువాత తన వారసులే తిరిగి ఆ పదవిలో ఉండాలని, వారే రాష్ట్రాన్ని ఏలాలని అనుకునే రోజులు ఇవి.  ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఇలాంటివి కామన్ గా కనిపిస్తుంటాయి.  ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సడెన్ గా కొన్నిస్ సమస్యల్లో ఇరుక్కొని పదవిని వదులుకోవలసి వచ్చినపుడు.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పార్టీలో సీనియర్ నాయకుడినో లేదంటే తనకు బాగా నమ్మకస్తుడిగా ఉండే వ్యక్తినో కూర్చోపెడతాడు.  నోటాలో ఏ అనుభవం లేని తన కొడుకుని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెడతాడు.  ఇందులో ముఖ్యమంత్రి నాజర్ స్వార్ధం కనిపిస్తుంది.  సమస్య నుంచి ఓ రెండు మూడు వారాల్లో బయటకు వచ్చేస్తాడు...   ఆ తరువాత తన పదవిని తిరిగి కొడుకు నుంచి తీసుకోవచ్చు అనే స్వార్ధం.  కొడుక్కు అసలు ఈ రాజకీయాల గురించి తెలియవు కాబట్టి తాను ఎక్కడ ఉన్నా.. తన కనుసైగల్లోనే రాజకీయాలు నడుస్తాయి అనే ధైర్యం మరొకటి.  ఈ రెండు కారణాల వలన నాజర్ తన కొడుకు విజయ్ ను సీఎం చేస్తాడు.  విజయ్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన సీన్ బాగా ఎలివేట్ అయింది. అప్పటి వరకు తన ఫ్రెండ్స్ తో కలిసి పబ్ లో ఎంజాయ్ చేసిన వ్యక్తి సడెన్ గా ముఖ్యమంత్రి అవుతున్నాడు అని తెలియగానే విజయ్ వచ్చిన మార్పు సినిమాకు హైలైట్ అయింది.  అమాయకత్వంతో కూడిన భయం కనిపిస్తుంది.  ముఖ్యమంత్రి అయ్యాక ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా సంతకాలు పెడుతుంటాడు.  

రెండు వారాల్లో వస్తాడని అనుకున్న నాజర్ కు కోర్టు ఐదేళ్ల శిక్ష విధించడంతో.. తప్పని సరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బయటకు వస్తాడు.. అసలు పదవి గురించి ఏమి తెలియని విజయ్.. సిటీలో జరిగే అల్లర్లను ఆపిన తీరు ప్రతి ఒక్కరిచేత చప్పట్లు కొట్టిస్తుంది.  నిజమైన రాజకీయాల్లో ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటే రాజకీయాలు మరోరకంగా ఉండేవి.  సినిమా కాబట్టి ఇలాంటి సాధ్యం అవుతుంటాయి.  ఒక ముఖ్యమంత్రి మంచి పనులు చేస్తే.. ప్రతి పక్షం ఊరుకొడుకదా.. ఏదో ఒక ప్లాన్ చేసి.. అధికార పార్టీని ఇరుకున పెట్టాలనే చూస్తుంది.  ఇది షరా మామూలే.  ముఖ్యమంత్రిని ఓ ఫ్రెండ్ చేత ట్రాప్ చేసి అమ్మాయితో డ్యాన్స్ చేసే సమయంలో కొన్ని ఫోటోలు తీస్తారు.  వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అనుకునే సమయంలో.. నాజర్ కు బెయిల్ రావడం.. బాంబ్ బ్లాస్టింగ్ జరగడం.. నాజర్ కోమాలోకి వెళ్లడం జరుగుతుంది.  తప్పనిసరి పరిస్థితిల్లో విజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు.  ఈ సమయంలో నాజర్ కు స్పృహ వచ్చినట్టు తెలిస్తే.. హాస్పిటల్ డాక్టర్స్ తో మ్యానేజ్ చేయించి.. న్యూస్ బులియన్ రాకుండా, నాజర్ ఉన్న గదిలోకి ఎవరిని పంపించకుండా ఆడిన డ్రామా సూపర్బ్.  రాజకీయాల్లో ఇలాంటి ఎత్తుగడలు సహజంగా జరుగుతుంటాయి.  

ఇక్కడ చెన్నైలో వచ్చిన వరదలను, వాటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటానికి విజయ్ తన టీమ్ తో కలిసి పనిచేరిన తీరు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది.  ఇలాంటి రాజకీయ నాయకులు ఇంతటి నిబద్దతతో పనిచేస్తే రాష్ట్రాలు ఎప్పుడో బాగుపడేవి. ఇలాంటి వ్యక్తులు సినిమాల్లో తప్ప బయట కనిపించరు.  

సెకండ్ హాఫ్ తండ్రి కొడుకుల మధ్య పదవి కోసం జరిగే పోరాటాన్ని దర్శకుడు చాలా తెలివిగా నడిపించాడు.  ముఖ్యమంత్రిగా ఉన్న నాజర్ తన కొడుకు విజయ్ కు పదవిని అప్పగించడం.. తరువాత ఆ పదవి కోసం కొడుకుతోనే పోరాటం చేయడం.. వంటి సీన్స్ నిజమైన రాజకీయాలకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.  రాజకీయ నాయకులు తమ సొంత వ్యక్తులను, తమ నీడలను కూడా నమ్మరు అంటారు కదా.. దానికి తార్కాణమే సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్.  నాజర్ మొదటి భార్య విజయ్ నీకే పుట్టాడు అనే గ్యారెంటీ ఏంటి అని చెప్పిన చిన్న మాట సినిమా.. సెకండ్ హాఫ్ మొత్తాన్ని నడిపిస్తుంది.  ఫైనల్ గా తాను చేసిన తప్పును తెలుసుకున్న నాజర్ కొడుకు చేసిన మంచి పనులను మెచ్చుకోవడంతో సినిమా ముగుస్తుంది.  

ఎలా చేశారు: 

సినిమాకు మెయిన్ పిల్లర్ ఎవరు ఇక్కడ సత్యరాజ్ అని చెప్పాలి. జర్నలిస్ట్ గా, విజయ్ కు గాడ్ ఫాదర్ గా అద్భుతంగా నటించాడు.  అమ్మాయిలతో హ్యాపీగా ఎంజాయ్ చేసే వ్యక్తిగా, అమాయక ముఖ్యమంత్రిగా, రౌడీ ముఖ్యమంత్రిగా విజయ్ నటన ఆకట్టుకుంది.  కొన్ని సన్నివేశాల్లో విజయ్ పరిణితిని కనబరిచాడు.  నాజర్ పాత్ర చాలా కీలకమైంది.  దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారో.. ఎలాంటి దర్భాన్ని ప్రదర్శిస్తారో అచ్చు గుద్దినట్టుగా చూపించాడు. మిగతా పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్ళేవి అయినప్పటికీ వారి పరిధిమేరకు నటించి మెప్పించారు.  

సాంకేతికవర్గం : 

దర్శకుడు ఆనంద్ శంకర్ బలమైన కథను ఎంచుకున్నాడు.  కొన్ని సన్నివేశాలు తప్పించి సినిమాను నడిపించిన తీరు ఆకట్టుకుంది.  మురుగదాస్ చిన్న సీన్ లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు.  శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  పాటలు ఆకట్టుకోలేదు.  మొదటి సాంగ్ అవసరమే.  సెకండ్ సాంగ్ ఎందుకు పెట్టారో తెలియదు. స్టూడియో గ్రీన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్ : 

నటీనటులు 

కథనాలు 

నెగెటివ్ పాయింట్స్ : 

సెకండ్ హాఫ్ లో అనవసరమైన డ్రామా సీన్స్ 

చివరిగా :  రౌడీ సీఎం ప్రజలను మెప్పించాడు