అమితావ్ ఘోష్ కు జ్ఞాన్ పీఠ్ ప్రదానం

అమితావ్ ఘోష్ కు జ్ఞాన్ పీఠ్ ప్రదానం

ప్రఖ్యాత ఆంగ్ల సాహిత్యకారుడు అమితావ్ ఘోష్ కు 2018 సంవత్సరానికి 54వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. అమితావ్ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న మొట్టమొదటి ఆంగ్ల రచయిత. దేశంలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞాన్ పీఠ్ పురస్కారం కింద అమితావ్ ఘోష్ కు రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి ప్రతిమ, ప్రశంసా పత్రం ప్రదానం చేశారు. ఆయనకు ఈ పురస్కారాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ అందజేశారు. డిసెంబర్ 2018లో ప్రతిభా రాయ్ అధ్యక్షతన సమావేశమైన జ్ఞాన్ పీఠ్ ఎంపిక కమిటీ ఇంగ్లిష్ రచయిత అమితావ్ ఘోష్ కు జ్ఞాన్ పీఠ్ పురస్కారం అందజేయాలని నిర్ణయించింది. మూడేళ్ల క్రితమే ఇంగ్లీష్ ను జ్ఞాన్ పీఠ్ పురస్కార భాషగా చేర్చారు. 

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో 1956లో జన్మించిన అమితావ్ ఘోష్ కు మందలో ఒకడిగా కాకుండా ప్రత్యేకతను చాటుకొనే రచయితగా సాహితీ లోకంలో గుర్తింపు ఉంది. చరిత్రలోని విషయాలను అత్యంత నిపుణతతో వర్తమానానికి జోడించడం ఆయనకే సాధ్యమైన శైలి. ఘోష్ సాహిత్య అకాడమీ, పద్మశ్రీ సహా ఎన్నో పురస్కారాలను పొందారు. ఆయన ప్రముఖ రచనల్లో 'ద సర్కిల్ ఆఫ్ రీజన్', 'ది షాడో లైన్', 'ద కలకత్తా క్రోమోజోమ్', 'ద గ్లాస్ ప్యాలెస్', 'ద హంగ్రీ టైడ్', 'రివర్ ఆఫ్ స్మోక్', 'ఫ్లడ్ ఆఫ్ ఫైర్' ప్రముఖమైనవి. మొదటి జ్ఞాన్ పీఠ్ పురస్కారం 1965లో మలయాళ రచయిత జీ శంకర్ కురుప్ పొందారు.