తాజ్‌లో 3 గంటలు దాటితే...

తాజ్‌లో 3 గంటలు దాటితే...

తాజ్‌మహల్‌ను చూసేందుకు మీరు ఈసారి వెళితే వెంటనే గబగబా తిరిగేయండి. ఎందుకంటే తాజ్‌ మహల్‌ వద్ద మీరు మూడు గంటలకు మించి గడిపితే అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికిగాను కొత్తగా ఏడు గేట్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక నుంచి ఎంట్రీ టికెట్‌ కొనుగోలు చేసి లోనికి వెళితే.. అవి కేవలం మూడు గంటలు మాత్రమే పనిచేస్తాయి. మూడు గంటలు పూర్తి అయ్యే లోపలే మీరు బయటకు వచ్చేయాలి. అంతకుమించి అక్కడ గడిపితే బయటకు వెళ్ళే గేటు వద్ద మీరు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనధికారికంగా చాలా మంది తాజ్‌ మహల్‌ చూసేందుకు వస్తున్నారని, వారిని అరికట్టేందుకే ఈ తరహా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సూర్యోదయానికి 30 నిమిషాల ముందు తాజ్‌లోకి వెళితే సూర్యాస్తమానికి 30 నిమిషాల ముందు వరకు ఉండేందుకు పర్యాటకులను అనుమతించేవారు. అయితే కేవలం మూడు గంటల వరకు మాత్రమే అనుమతించడంతో టూరిజం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.