మోడీ తప్పుడు వాగ్దానాలు చేశారని 9 రాష్ట్రాల్లో పోలీస్ ఫిర్యాదు

మోడీ తప్పుడు వాగ్దానాలు చేశారని 9 రాష్ట్రాల్లో పోలీస్ ఫిర్యాదు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమకు తప్పుడు వాగ్దానాలు చేశారంటూ 9 రాష్ట్రాలలో వేలాది మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) కార్మికులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేయించబోయారు. 'నరేగా చెల్లింపుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలను దారుణంగా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ' నరేగా సంఘర్ష్ మోర్చా నేషనల్ డే ఆఫ్ యాక్షన్ సందర్భంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది.

బిహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లోని  50 జిల్లాలకు చెందిన కార్మికులు సుమారు 150 పోలీస్ స్టేషన్ల ఎదుట ప్రదర్శన నిర్వహించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించేందుకు ప్రయత్నించారు. 'ఐదేళ్లుగా నరేగా చట్టాన్ని తొక్కేసేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తగినన్ని నిధులు కేటాయించకపోవడం, తగిన సమయానికి కోరినన్ని నిధులు ఇవ్వకపోవడం, వేతనాల చెల్లింపులో జాప్యం ద్వారా పని డిమాండ్ ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని' ఓ ప్రకటనలో పేర్కొంది.

గత ఐదేళ్లలో నరేగా కార్యక్రమానికి కనీసం రూ.88,000 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉందని నరేగా సంఘర్ష్ మోర్చా తెలిపింది. 'కానీ తగినన్ని నిధులు లేని కారణంగా వేతనాల చెల్లింపులు పదేపదే వాయిదా పడ్డాయి. ఏడాదిలో క్లిష్ట సమయాల్లో డిమాండ్ కి తగినట్టు పనులు చేపట్టలేదని' చెప్పింది. ఈ కారణంగా కార్మికులు ఎన్నో కష్టనష్టాలకు లోనయ్యారని పేర్కొంది.

వేతనాలు చెల్లించకుండా తమతో పని చేయించేందుకు ప్రధాని మోడీ అబద్ధపు వాగ్దానాలు చేసి నరేగా చట్టాన్ని ఉల్లంఘించారని నరేగా సంఘర్ష్ మోర్చా ఆరోపించింది. కార్మికులకు, వారి కుటుంబాలకు నష్టం కలిగించే ఉద్దేశంతో ప్రధాని మోసపూరిత వాగ్దానాలు చేసినందువల్ల ఆయనను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. 

నరేగాకు నిధులు లేనందువల్ల అక్టోబర్ 2018-ఫిబ్రవరి 2019 మధ్యలో చాలా రాష్ట్రాలకు నిధుల బదిలీ జరగలేదని పత్రికా ప్రకటనలో పేర్కొంది. జూన్ 2019 వరకు నరేగా పనుల కోసం రూ.25,000 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కి లేఖ రాయడం జరిగింది.