ఎన్నారైలకు చేరని జాతీయ జెండాలు

ఎన్నారైలకు చేరని జాతీయ జెండాలు

నేడు భారత స్వాతంత్ర్య దినోత్సవం. మీరు ఏ అమెరికాలోనో, ఇతర దేశాల్లోనో ఉంటున్నప్పటికీ మాతృదేశం మీద మమకారం కొద్దీ మీ ఆవరణలో మువ్వన్నెల జెండాను ఎగరేద్దామనుకుంటున్నారా? పంద్రాగస్ట్ కు చాలా వారాల ముందే మేడిన్ ఇండియా జాతీయ జెండాను ఆర్డర్ చేసినా ఇంకా రాలేదా? దీంతో  చైనాలో తయారైన భారత జాతీయ జెండాను ఎగరేసి దేశభక్తిని చాటుకోవాల్సి వచ్చిందని బాధపడుతున్నారా? కొరియర్ కంపెనీ మీ పార్శిల్ ని ఎక్కడో గల్లంతు చేసిందనుకుంటున్నారా? నిజమే. కొరియర్ కంపెనీలే మీ ఆర్డర్ ని బుట్టదాఖలు చేశాయి. ఎందుకంటే కొరియర్ కంపెనీలేవీ కూడా త్రివర్ణ పతాకాన్ని భారత సరిహద్దుల బయటికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా లేవు. 

అంతర్జాతీయ కొరియర్ కంపెనీలైన ఫెడెక్స్, టీఎన్టీ, యుపిఎస్, డీహెచ్ఎల్, ఇతర సంస్థలేవీ విదేశాలకు భారత జాతీయ జెండా కన్ సైన్ మెంట్లను  అంగీకరించడం లేదు. అవి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయో ఎవరికీ తెలియదు. ఈ వ్యవహారం గురించి హోమ్ మంత్రిత్వ శాఖకే సమాచారం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. జాతీయ జెండా నిబంధనల ప్రకారం త్రివర్ణ పతాకాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. అలాంటపుడు ఎందుకు కొరియర్ సంస్థలు అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నాయి?

జెండా తయారీదారులు కూడా కొరియర్ కంపెనీల వ్యవహారంపై మండిపడుతున్నారు. ఆర్డర్ ప్రకారం జెండాలు తయారుచేసి తీసుకెళ్తే విదేశాలకు చెందిన ఏ కొరియర్ కంపెనీ కూడా మువ్వన్నెల జెండాను తీసుకోవడం లేదు.. అందులో జాతీయ జెండాలు ఉన్నాయని తెలియగానే వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాయి.. త్రివర్ణ పతాకాన్ని రవాణా చేయడం కానీ విదేశాలకు పంపడం కానీ చేయబోమని ముఖం మీదే స్పష్టంగా చెప్పేస్తున్నాయి. అయితే దీనిపై కొరియర్ కంపెనీలు మాత్రం దీనిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. ఎంత ప్రయత్నించినా కొన్ని వస్తువుల ఎగుమతిపై కఠినమైన విధానాలు, మార్గదర్శకాలు ఉంటాయి. వాటిని కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే రవాణా చేస్తామని మొక్కుబడి మాటలు చెబుతున్నారు.

ఎంతో కాలంగా కొరియర్ కంపెనీల ఈ వ్యవహారంతో విసిగిపోయిన వాళ్లు మాత్రం జాతీయ జెండాలను వాళ్లు నిషేధిత వస్తువుగా భావిస్తున్నందువల్లే కొరియర్ సంస్థలు వాటిని సరిహద్దులు దాటి రవాణా చేసేందుకు విముఖత చూపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కొందరు తెలివైన వ్యాపారస్థులు మాత్రం దీనిని గుడ్డ నమూనాగా పేర్కొంటూ విదేశాలకు పంపిస్తున్నారు.