జీడీపీ అంకెలు తప్పులా? అడ్రస్ లేని 36% కంపెనీలు!!

జీడీపీ అంకెలు తప్పులా? అడ్రస్ లేని 36% కంపెనీలు!!

జీడీపీ గణాంకాల లెక్కింపుపై ఎప్పుడూ వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ చర్చ కొత్త మలుపు తిరిగింది. ఈ కాలంలో పలు జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రభుత్వ అంకెలపై తరచుగా ప్రశ్నలు లేవనెత్తుతూ వచ్చాయి. ఇప్పుడు జాతీయ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) అధ్యయనంలో దీని గురించి ఓ కొత్త విషయం వెలుగు చూసింది. ఈ అధ్యయనం తర్వాత ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ జీడీపీ లెక్కింపులో కొత్త లోపాలు బయటపడ్డాయి. ఇవి కొన్ని కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 12 నెలలు సాగిన ఎన్ఎస్ఎస్ఓ అధ్యయనం జూన్ 2017లో పూర్తయింది. కానీ దీనిని ఇటీవలే జారీ చేయడం జరిగింది. 

ఈ అధ్యయనంలో ఎంసీఏ-21 డేటాబేస్ కూడా ఉంది. జీడీపీ లెక్కింపులో ఉపయోగించిన దాదాపు 36 శాతం కంపెనీల గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ కంపెనీల వర్గీకరణ కూడా తప్పుగా చేసినట్టు ఈ అధ్యయనంలో తేలింది. రిపోర్ట్ ప్రకారం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వీటిని 'చురుగ్గా ఉన్న కంపెనీల' కింద లిస్ట్ చేసింది. గత మూడేళ్లలో ఒకసారైనా పన్నులు కట్టి, రిటర్న్ లు దాఖలు చేసిన కంపెనీలకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ సక్రియ కంపెనీల హోదా ఇస్తుంది. 

ఈ అధ్యయనం ఒకప్పుడు సీఎస్ఓ ప్రపంచవ్యాప్తంగా తన నాణ్యత, భారత అధికారిక గణాంకాల విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) పతనాన్ని సూచిస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏకి ముందు యుపిఏ ప్రభుత్వంలో జీడీపీ గణనకు ఈ విధంగా డేటాని ఉపయోగించేవారు కాదు. 2015 నుంచి సీఎస్ఓ గణాంకాలు సేకరించేందుకు ఎంసీఏ-21ని ఉపయోగించడం ప్రారంభించింది. సీఎస్ఓ ఈ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్ సైట్ నుంచి సేకరించింది. ఆరంభంలోనే ఈ పద్ధతిని పలువురు వ్యతిరేకించారు. 

ఎన్నో నకిలీ కంపెనీలు జాబితాలో చేర్చిన ఈ డేటాబేస్ ను జీడీపీ లెక్కించేందుకు ఉపయోగించడం సరికాదని విమర్శకులు అభ్యంతరం తెలిపారు. వీటిలో చాలా కంపెనీలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయి. నిజానికి ఇవేవీ పనిచేయడం లేదు. ఇలాంటి గణాంకాలు ఉపయోగించడానికి ముందు వాటిపై పరిశోధన జరపాలని నిపుణులు సూచించారు. ఈ అంకెలను శోధించేవారు, సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచాలని కోరారు. దీంతో ప్రతి యూనిట్ స్థాయిలో డేటాకి సంబంధించిన వాస్తవాలు తెలుస్తాయన్నారు.