తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు ... యన్టీఆర్ - ఏయన్నార్ 

తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు ... యన్టీఆర్ - ఏయన్నార్ 

తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళుగా నిలచి, సినిమా రంగం పురోభివృద్ధికి పాటు పడిన మహానటులు యన్టీఆర్- ఏయన్నార్. ఈ ఇద్దరు మహానటులే తెలుగు చిత్రసీమకు క్రమశిక్షణను నేర్పారు అనడమూ అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరు మహానటుల అడుగు జాడల్లోనే తరువాతి తరాలు నడిచాయి. స్వరాష్ట్రంలో చిత్రసీమ స్థిరపడటానికి కూడా ఈ ఇద్దరు మహానటులు చేసిన కృషిని మరచి పోరాదు. తాము బాగు పడడమే కాకుండా, తమ చుట్టూ ఉన్నవారినీ అభివృద్ధిలోకి తీసుకు వచ్చిన ఘనత ఈ ఇద్దరు మహానటులదే! వీరి అనుబంధం కూడా అన్నదమ్ముల అనుబంధంలాగే సాగింది. వీరిద్దరిలో నందమూరి తారకరామారావు పెద్దవారు. ఆయన 1923 మే 28న జన్మించగా, అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబర్ 20న జన్మించారు. చిత్రసీమలో ఏయన్నార్ 1941లో 17 ఏళ్ళ వయసులోనే అడుగుపెట్టారు. యన్టీఆర్ 1949లో చిత్రసీమలో ప్రవేశించారు. 

అనుబంధం
వయసులో తనకంటే పెద్దవారయిన యన్టీఆర్ ను ఏయన్నార్ గౌరవించేవారు. అలాగే చిత్రసీమలో తనకంటే సీనియర్ అయిన ఏయన్నార్ ను రామారావు ఎంతగానో గౌరవించేవారు. ఇక ఈ ఇద్దరు మహానటులది కృష్ణాజిల్లా కావడం, అందులోనూ  గుడివాడ తాలూకానే కావడం మరో విశేషం. యన్టీఆర్ ది నిమ్మకూరు అనే గ్రామం. రామాపురం అనే గ్రామంలో ఏయన్నార్ జన్మించారు. ఈ ఇద్దరు మహానటులు తొలిసారి 'పల్లెటూరి పిల్ల' (1950) చిత్రంలో కలసి నటించచారు. యన్టీఆర్ కు అదే తొలి జానపద చిత్రం. తరువాత వారిద్దరూ కలసి నటించిన సినిమా 'సంసారం' (1950). ఇదే ఏయన్నార్ కు మొదటి సాంఘిక చిత్రం కావడం మరో విశేషం. యన్టీఆర్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు ఏయన్నార్ జానపద కథానాయకునిగా జైత్రయాత్ర చేస్తున్నారు. యన్టీఆర్ 'పాతాళభైరవి' (1951) ఘనవిజయంతో తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనే ఆ మాటకొస్తే ప్రపంచంలోనే తిరుగులేని జానపద కథానాయకుడు అనిపించుకున్నారు. దాదాపు 40 జానపద చిత్రాలలో యన్టీఆర్ కథానాయకునిగా నటించారు. ప్రపంచంలో అన్ని ఫోక్లోర్ మూవీస్ లో హీరోగా నటించి విజయం సాధించిన నటుడు మరొకరు కానరారు. రామారావు రాకతో అంతకు ముందు జానపద నాయకునిగా ఉన్న ఏయన్నార్ సాంఘికాలకే పరిమితమై పోయారు. 

ఈ ఇద్దరు మహానటులు కృషి, దీక్ష , పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. యన్టీఆర్ అందగాడు, అభినయంలో ఆకట్టుకొనే సౌష్టవం గలవారు. ఆయన ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయేవారు. అందువల్లే యన్టీఆర్ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో తిరుగులేని రారాజుగా సాగారు. ఆల్ రౌండర్ అన్న పదానికి అసలు సిసలు నిదర్శనంగా నిలిచారు. యన్టీఆర్ కంటే చాలా విషయాల్లో ఏయన్నార్ తక్కువే. అయితే "స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య" అన్న మీర్జా గాలిబ్ సూక్తిని అనుసరిస్తూ ఏయన్నార్ తనను తాను మలచుకున్నారు. ఎదురుగా యన్టీఆర్ అంతటి మహానటుడు అన్నిటా రాణిస్తూ సాగుతుంటే, తన దరికి చేరిన పాత్రలతోనే జనాన్ని మెప్పిస్తూ, ఆయనకు సమవుజ్జీ అనిపించుకున్నారు. ఇలాంటి చరిత్ర ఈ ఇద్దరు మహానటుల్లోనే కనిపిస్తుంది. ఈ మహానటులు ఇద్దరూ కలసి 15 చిత్రాలలో నటించారు. ఆ చిత్రాల వివరాల్లోకి వెళ్దాం. 

పల్లెటూరి పిల్ల (1950)
విడుదల తేదీ: 27-4-1950

రామారావు చిత్రసీమలో అడుగు పెట్టే నాటికే నాగేశ్వరరావు జానపద కథానాయకునిగా 'బాలరాజు, కీలుగుర్రం' వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి ఉన్నారు. ఏయన్నార్ ను ఘంటసాల బలరామయ్య సినిమా రంగానికి పరిచయం చేయగా, యన్టీఆర్ ను  ఎల్వీ ప్రసాద్ పరిచయం చేశారు. యన్టీఆర్ తొలి చిత్రం 'మనదేశం' (1949). ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే యన్టీఆర్ గురించి సినిమా జనం మాట్లాడుకోసాగారు. అందువల్ల కొత్తగా వచ్చిన నటుడు యన్టీఆర్ ఎలా ఉంటారో చూడాలని ఏయన్నార్ ఆయన నటిస్తున్న 'షావుకారు' సినిమా షూటింగ్ కూ వెళ్ళారు. అక్కడ ఆయనను చూడగానే, స్ఫురద్రూపి అని ఇట్టే గ్రహించేశారు ఏయన్నార్. ఆ తరువాతే బి.ఏ.సుబ్బారావు తన 'పల్లెటూరి పిల్ల' (1950)లో ఇద్దరినీ కలసి నటింప చేశారు. అందులో యన్టీఆర్ కథానాయకుడు. ఏయన్నార్ తాను ఎంతగానో ప్రేమించిన 'పల్లెటూరి పిల్ల' అంజలీదేవి, యన్టీఆర్ ను ప్రేమించడంతో తన ప్రేమను చంపుకుంటాడు. చివరకు యన్టీఆర్, అంజలీదేవి కొడుకును కాపాడడంలో తన ప్రాణాలను బలిచేసుకుంటాడు. ఇందులో ఏయన్నార్ త్యాగమూర్తిగా కనిపిస్తారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. 

సంసారం (1950)
విడుదల తేదీ: 29-12-1950

ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన 'సంసారం' చిత్రంలో  యన్టీఆర్, ఏయన్నార్ అన్నదమ్ములుగా నటించారు. ఏ ముహూర్తాన అందులో అన్నదమ్ములుగా నటించారో కానీ, ఆ తరువాత ఇద్దరూ అలాగే మసలుకున్నారు. ఏయన్నార్ తల్లి పున్నమ్మ యన్టీఆర్ ను 'పెద్దాడా' అని ప్రేమగా పిలిచేవారు. ఏయన్నార్ కంటే ముందు కొంతమంది అన్నలు ఉన్నా, యన్టీఆర్ ను మరో అన్నయ్యగా బావించేవారు ఏయన్నార్. ఇక రామారావు తండ్రి లక్ష్మయ్య చౌదరి నాగేశ్వరరావును తన మూడో అబ్బాయిగా అభిమానించేవారు. ఇక 'సంసారం' సినిమా విషయానికి వస్తే, అందులో పట్నంలో ఉంటూ యన్టీఆర్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఏయన్నార్ పల్లెలో పొలం పనులు చూసుకుంటూ ఉంటాడు. భార్యాబిడ్డలతో యన్టీఆర్ కాపురం సజావుగా సాగుతూ  ఉండగా. ఆయన తల్లీ చెల్లీ వచ్చి ఆ సంసారంలో నిప్పులు పోస్తారు. దాంతో పిచ్చివాడై యన్టీఆర్ దేశాలు పట్టుకు తిరుగుతాడు. చెదిరిపోయిన అన్న కుటుంంబాన్ని తమ్ముడు ఏయన్నార్ కలపడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి, రజతోత్సవం చేసుకుంది. 

పరివర్తన (1954)
విడుదల తేదీ: 1-9-1954

తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన 'పరివర్తన' చిత్రంలో యన్టీఆర్ ధనవంతునిగా, ఆయన వద్ద పనిచేసే గుమస్తాగా ఏయన్నార్ నటించారు. ఈ చిత్రంలో ఏయన్నార్ చెల్లెలుగా సావిత్రి అభినయించారు. ధనగర్వంతో తనకు అడ్డొచ్చిన వారిని కాలరాచే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యన్టీఆర్ నటించారు. ఇందులో ఏయన్నార్ కుటుంంబాన్ని నానా కష్టాలు పెడతారు. అతని చెల్లెలి సావిత్రినే పెళ్ళి చేసుకుంటారు. చివరకు ఆయనలో పరివర్తన కలుగుతుంది. మారిన మనిషి అవుతారు. ఈ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యన్టీఆర్ చక్కగా నటించారు. ఈ సినిమా శతదినోత్సవం చేసుకుంది. 

మిస్సమ్మ (1955)
విడుదల తేదీ: 12-1-1955

విజయా సంస్థకు యన్టీఆర్ పర్మినెంట్ ఆర్టిస్ట్. అందువల్ల వారు తీసే చిత్రాలలో యన్టీఆర్ ప్రధాన కథానాయకుడుగా ఉండేవారు. 'మిస్సమ్మ' చిత్రంలో యమ్.టి.రావుగా రామారావు నటిస్తే, డిటెక్టివ్ రాజుగా ఏయన్నార్ కామెడీ రోల్ లో అలరించారు. నిరుద్యోగ సమస్యతో సతమతమయ్యే  ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నాటకం ఆడుతూ వినోదంతో సాగే చిత్రం 'మిస్సమ్మ'. ఇందులో మిస్సమ్మగా సావిత్రి నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తమిళ, హిందీ భాషల్లనూ రీమేక్ అయింది. ఇందులో యన్టీఆర్ అందం, సావిత్రి అభినయం, ఏయన్నార్ కామెడీ అందరినీ ఆకట్టుకున్నాయి. 

రేచుక్క (1955)
విడుదల తేదీ: 25-3-1955

ఏయన్నార్ ను చిత్రసీమకు పరిచయంచేసిన ఘంటసాల బలరామయ్య, యన్టీఆర్ తో 'రేచుక్క' అనే చిత్రాన్ని ఆరంభించారు. ఈ సినిమా షూటింగ్ కొంత సాగగానే బలరామయ్య కాలం చేశారు. దాంతో పి.పుల్లయ్య దర్శకత్వంలో 'రేచుక్క' పూర్తయింది. ఘంటసాల బలరామయ్య మీద అభిమానంతో ఏయన్నార్ ఇందులో ఓ పాటలో కొన్ని నిమిషాలు కనిపించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 

తెనాలి రామకృష్ణ (1956)
విడుదల తేదీ: 12-1-1956

ఏయన్నార్ తనకంటే సీనియర్ అయి ఉండి, అందునా జానపద నాయకుడుగా సక్సెస్ సాధించినా, 'రేచుక్క'లో గెస్ట్ గా నటించడంతో ఆయనంటే యన్టీఆర్ కు అమితాభిమానం పెరిగింది. అందువల్ల 'తెనాలి రామకృష్ణ' లో ఏయన్నార్ టైటిల్ రోల్ లో కనిపించినా, యన్టీఆర్ శ్రీకృష్ణ దేవరాయలుగా కీలక పాత్రలో నటించారు. ఇదే చిత్రాన్ని తమిళంలో శివాజీగణేశన్ తో తెరకెక్కించా, అక్కడా యన్టీఆరే శ్రీకృష్ణదేవరాయలుగా నటించడం విశేషం. ఈ సినిమాలో ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

చరణదాసి (1956)
విడుదల తేదీ: 20-12-1956

'చరణదాసి' బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఇందులో తన మిత్రుని చెల్లెలు అంజలీదేవి పెళ్ళి ఆగిపోవడంతో ఆ పెళ్ళికి వెళ్లిన  యన్టీఆర్, ఆమె ముఖం కూడా చూడకుండానే తాళికడతాడు. రైలులో భార్యను తీసుకొని బయలు దేరతాడు. అదే రైలులో ఏయన్నార్ కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్యతో ప్రయాణిస్తుంటాడు. రైలు ప్రమాదంలో ఏయన్నార్ భార్య చనిపోతుంది. అంజలీదేవి, ఏయన్నార్ చెంత చేరుతుంది. అయితే అతనికి తన భార్యెవరో తెలియడం వల్ల ఆమె తన భార్య కాదని చెబుతాడు. ఇక ఏయన్నార్ ప్రేమించిన అమ్మాయి సావిత్రికి యన్టీఆర్ డాక్టర్ గా ట్రీట్ మెంట్ ఇస్తూ ఉంటాడు. వారిద్దరికీ పెళ్ళి చేయాలనుకుంటారు. చివరకు అంజలీదేవికి, తన అన్న మిత్రుడు యన్టీఆర్ తనను పెళ్ళి చేసుకున్నాడన్న విషయం తెలుస్తుంది. దాంతో ఆ చరణదాసి తన భర్తను చేరుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ చిత్రంలో ఓ డ్రీమ్ సీక్వెన్స్  లో యన్టీఆర్ శ్రీరామునిగా, అంజలీదేవి సీతగా కనిపిస్తారు. ఆ సీక్వెన్స్ చూడటం కోసమే ఆ రోజుల్లో జనం 'చరణదాసి'కి పరుగులు తీసేవారట. ఈ చిత్రాన్ని నిర్మించిన శంకర్ రెడ్డి తరువాతి రోజుల్లో యన్టీఆర్, అంజలీదేవితోనే 'లవకుశ' (1963) తీసి చరిత్రలో నిలచిపోయే విజయాన్ని చూశారు. 

మాయాబజార్ (1957)
విడుదల తేదీ: 27-3-1957

యన్టీఆర్ ను పౌరాణికాల్లో మేటిగా నిలిపిన చిత్రం 'మాయాబజార్'. అంతకు ముందు యన్టీఆర్ 'మాయారంభ' (1950)లో నలకూబరుని పాత్ర పోషించారు. ఇదే ఆయన తొలి పౌరాణిక చిత్రం. ఆ తరువాత 'జయసింహ' (1955)లో ఓ  డ్రీమ్ సాంగ్ లో అర్జునునిగా కనిపించారు. 'చరణదాసి'లో ఓ సన్నివేశంలో శ్రీరామునిగా దర్శనమిచ్చారు. 'ఇద్దరు పెళ్ళాలు' (1954)లో ఓ స్వప్నగీతంలో శ్రీకృష్ణునిగా తొలిసారి తెరపై కనిపించారు. ఆ తరువాత 'సొంతవూరు' (1956)లోనూ ఓ సీన్ లో శ్రీకృష్ణ పాత్రలో దర్శనమిచ్చారు. శ్రీకృష్ణునిగా తాను కనిపించిన పాత్రలు అంతగా అలరించలేదని యన్టీఆర్ కు ఓ సెంటిమెంట్ ఉండేది. అయితే దానిని పటాపంచెలు చేస్తూ, ఆయనతోనే 'మాయాబజార్'లో  శ్రీకృష్ణ పాత్రను పోషింప చేశారు కేవీ రెడ్డి. నిజానికి ఈ కథ భారతంలో లేదు. కేవలం భారతంలోని పాత్రలతో కల్పితమై తెలుగునేలపై విశేష ఆదరణ పొందిన కథతో 'మాయాబజార్' తెరకెక్కింది. ఇందులో యన్టీఆర్ శ్రీకృష్ణునిగానూ, ఏయన్నార్ అభిమన్యునిగానూ నటించారు. ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. రజతోత్సవాలు చేసుకుంది. ఈ నాటికీ బుల్లితెరపై అలరిస్తూనే ఉంది. ఇక తెలుగునాట రంగులు పలుముకొని జనం ముందు నిలచిన తొలి చిత్రంగానూ 'మాయాబజార్' నిలచింది. ఈ సినిమా విడుదలైన రోజుల్లో యన్టీఆర్ శ్రీకృష్ణునిగా ఉన్న కేలండర్స్ ను లక్ష కాపీలు ప్రింట్ చేయించి అమ్మగా, అన్నీ తొలి రిలీజులోనే అమ్ముడయ్యాయి. తరువాత మళ్ళీ ఆ కేలండర్స్  ప్రింట్ చేయించవలసి వచ్చింది. ఆ కేలండర్స్ ను పటం కట్టించుకొని తమ ఇళ్ళలోని పూజాగృహాల్లో పెట్టుకొని ఎంతోమంది పూజలు చేశారు. ఆ తరువాత ఇరవైకి పైగా చిత్రాలలో యన్టీఆర్ శ్రీకృష్ణ పాత్ర లో కనిపించి ఓ పౌరాణిక పాత్రలో అత్యధిక సార్లు తెరపై కనిపించిన నటునిగా ప్రపంచ రికార్డు నమోదు చేశారు. 

భూకైలాస్ (1958)
విడుదల తేదీ: 20-3-1958

యన్టీఆర్ రావణబ్రహ్మగా, ఏయన్నార్ నారదునిగా నటించిన చిత్రం 'భూకైలాస్'. ఈ చిత్రంలో వరుసకు యన్టీఆర్ కు, ఏయన్నార్ తాత వరుస కావడం, సినిమాలోనూ అక్కినేనిని నందమూరి 'తాత' అని సంబోధించడం అప్పట్లో విశేషంగా చెప్పుకొనేవారు. ఇద్దరూ తమకు లభించిన పాత్రలకు న్యాయం చేశారు. ఇప్పటికీ పర్వదినాలలో ఈ చిత్రం బుల్లితెరపై జనాన్ని అలరిస్తూనే ఉండడం విశేషం. 

గుండమ్మ కథ (1962)
విడుదల తేదీ: 7-6-1962

'గుండమ్మ కథ' చిత్రం సమయానికి తెలుగునేలపై యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ విశేషాదరణ ఉండేది. వారి చిత్రాలు బాక్సాఫీసు బరిలో పోటీపడి సాగుతూఉండేవి. అందువల్ల ఈ చిత్రంలో ఎవరి పేరు ముందు టైటిల్స్ వేయాలన్న సంశయం కలిగింది. ఎవరి పేరు ముందు వేసినా, వారి అభిమానులకు అది నచ్చకపోవచ్చునని, సినిమాలో ఇద్దరి ఫోటోలను ఒకేసారి టైటిల్స్ లో చూపించడం జరిగింది. ఈ చిత్రానికి మాతృక కన్నడ సినిమా. ఆ మాతృకకు కొన్ని మార్పులూ చేర్పులూ చేసి 'గుండమ్మ కథ' రూపొందించారు. నిజానికి ఇది 'గుండమ్మ అల్లుళ్ళ కథ'. కానీ, ఇద్దరు అగ్రశ్రేణి నటులు ఉన్న సినిమాలో టైటిల్ వారిపై పెడితే, అభిమానుల మధ్య ఘర్షణలు చోటు చేసుకొనే ప్రమాదం ఉందని, టైటిల్ ను 'గుండమ్మ కథ'గా పెట్టారు. ఈ సినిమాను తమిళంలోనూ రూపొందించారు. తెలుగు చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా,విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి తమిళ వర్షన్ 'మనిదన్ మారవిల్లై'కి దర్శకులు. తమిళ చిత్రం కంటే తెలుగు సినిమా ముందు విడుదలయింది. మరో విశేషం ఏమంటే, ఈ సినిమా యన్టీఆర్ కు నూరవ చిత్రం. ఇక తమిళ 'మనిదన్ మారవిల్లై'లో ఏయన్నార్ తన పాత్రను తానే పోషించారు. అది ఆయనకు వందో చిత్రం కావడం మరింత విశేషం. అయితే, తెలుగులో యన్టీఆర్ పోషించిన పాత్రను తమిళంలో జెమినీగణేశన్ ధరించారు. అక్కడ ఈ కథ  ఆకట్టుకోలేకపోయింది. తెలుగులోమాత్రం ఘనవియం సాధించి సిల్వర్ జూబ్లీ హిట్ గా నిలచి, ఆ యేడాది బ్లాక్ బస్టర్ గానూ జేజేలు అందుకుంది. 


శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
విడుదల తేదీ: 9-1-1963

ఇక మరోమారు యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరిలో ఎవరిపేరు ముందువేయాలన్న మీమాంస 'శ్రీకృష్ణార్జున యుద్ధం' చిత్రం సమయంలోనూ ఎదురయింది. ఇందులో యన్టీఆర్ శ్రీకృష్ణునిగా, ఏయన్నార్ అర్జునునిగా నటించారు. సినిమా టైటిల్స్ ఆరంభంలోనే యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరినీ ఒకేసారి తెరపై చూపిస్తారు.  టైటిల్ 'శ్రీకృష్ణార్జున యుద్ధం' కాబట్టి, శ్రీకృష్ణుని పేరు ముందు ఉన్నందువల్ల యన్టీఆరే గ్రేట్ అని ఆయన అభిమానులు చెప్పుకొనేవారు. ఇక సినిమాలోనూ శ్రీకృష్ణ పాత్ర పైచేయిగా సాగుతుంది. ఈ చిత్రం విడుదలైన రోజుల్లో తెరపై శ్రీకృష్ణ పాత్రలో యన్టీఆర్ కనిపించగానే థియేటర్లలో టెంకాయలు కొట్టడం, హారతులు ఇవ్వడం జరిగింది. వాటికి ప్రత్యక్ష సాక్షి ఏయన్నార్ అర్ధాంగి అన్నపూర్ణమ్మ. దాంతో  యన్టీఆర్ పౌరాణికాల్లో ఇకపై నటించకండి అంటూ ఆమె సలహా ఇచ్చారు. దానిని అక్కినేని తు.చ. తప్పక పాటించారు. 'శ్రీకృష్ణార్జున యుద్ధం' మంచి విజయం సాధించింది. ఇప్పటికీ పర్వదినాల్లో బుల్లితెరపై అలరిస్తూనే ఉండడం విశేషం. 

రామదాసు (1964)
విడుదల తేదీ: 23-12-1964

యన్టీఆర్, ఏయన్నార్ కు ముందు తెలుగు చిత్రసీమలో స్టార్ గా వెలిగారు మహానటుడు చిత్తూరు వి.నాగయ్య. ఆయనంటే అందరికీ ఎంతో గౌరవం. నాగయ్య స్వీయ దర్శకత్వంలో 'రామదాసు' చిత్రం నిర్మించారు. ఆయనపై గౌరవంతో యన్టీఆర్, ఏయన్నార్, శివాజీగణేశన్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో  శ్రీమహావిష్ణువుగా ఏయన్నార్ కనిపిస్తే, శ్రీరామునిగా యన్టీఆర్ అలరించారు. చిత్రమేమంటే, సినిమాలో శ్రీమహావిష్ణువు పాత్రధారి అక్కినేని ఫేడ్ అయి, శ్రీరామునిగా యన్టీఆర్ తెరపై కనిపిస్తారు. ఈ సీన్ చూడటానికే అభిమానులు ఈ చిత్రానికి అదే పనిగా వెళ్ళేవారు. ఈ సినిమా నిర్మాణంలో చాలా జాప్యం జరగడం, వడ్డీలు పెరిగి అధిక వ్యయం అయింది. అందువల్ల 'రామదాసు' బాగానే ఆడినా, నాగయ్యకు లాభాలను మాత్రం అందించలేకపోయింది. 

చాణక్య- చంద్రగుప్త (1977)
విడుదల తేదీ: 25-8-1977

ఆ తరువాత దాదాపు 13 ఏళ్ళు యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించలేదు. పైగా వారిద్దరి మధ్య దూరం పెంచేలా కొందరు ప్రవర్తించారు. దాంతో వారి మధ్య పొరపొచ్చాలు పొడసూపాయి. అయినా యన్టీఆర్, ఏయన్నార్ చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం కలసే నిర్ణయాలు తీసుకొనేవారు. ఇక వారి రెండు కుటుంబాల మధ్య ఎంతో అనుబంధం ఉండేది. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన 'చాణక్య - చంద్రగుప్త' చిత్రంలో ఏయన్నార్ చాణక్య పాత్ర పోషించారు. యన్టీఆర్ చంద్రగుప్తునిగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే యన్టీఆర్ ను ఏయన్నార్ కేవీరెడ్డి, బి.యన్.రెడ్డి వంటి సీనియర్ డైరెక్టర్స్ తో పోల్చారు. ఇక  చిత్రం షూటింగ్ సమయంలోనే ఏయన్నార్ ను యన్టీఆర్ అభిమానులు సన్మానించడం విశేషం. పోటీదారులుగా సాగిన ఇద్దరు అగ్రశ్రేణి కథానాయకుల అభిమానుల్లో ఒక హీరోను మరో హీరో అభిమానులు గౌరవించడం అరుదైన విషయం అలాంటి సంఘటనకు తెరతీసిన ఘనత యన్టీఆర్ అభిమానులదే! 'చాణక్య - చంద్రగుప్త' ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోయినా, రామారావుకు మంచి లాభాలనే అందించింది. 

రామకృష్ణులు (1978)
విడుదల తేదీ: 8-6-1978

యన్టీఆర్ సొంత సంస్థ రామకృష్ణా సినీస్టూడియోస్ బ్యానర్ లో రూపొందిన 'చాణక్య-చంద్రగుప్త'లో ఏయన్నార్ పారితోషికం పుచ్చుకోకుండా నటించారు. ఆ అభిమానంతో యన్టీఆర్, ఏయన్నార్ కు అన్నపూర్ణ బ్యానర్ లో నటించడానికి ఎప్పుడైనా కాల్ షీట్స్ ఇస్తానని మాట ఇచ్చారు. అప్పట్లో యన్టీఆర్ పారితోషికం, ఏయన్నార్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉండేది. అయినా ఏలాంటి లెక్కలూ చూసుకోకుండా యన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అన్నపూర్ణ సినీస్టూడియోస్ బ్యానర్ కు కాల్ షీట్స్ ఇచ్చారు. ఆ డేట్స్ తోనే ఏయన్నార్, జగపతి ఆర్ట్ పిక్చర్స్ తో కలసి 'రామకృష్ణులు' చిత్రాన్ని రూపొందించారు. ఇందులో యన్టీఆర్ రాము, ఏయన్నార్ కృష్ణ గా నటించారు. ఈ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. 
 
సత్యం- శివం (1981)
విడుదల తేదీ: 28-5-1981

యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన చివరి చిత్రం 'సత్యం - శివం' . ఈ చిత్రాన్ని యన్టీఆర్ రెండో అల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మించడం విశేషం. సినిమాలో నిర్మాతగా ఆయన పేరు డి.వెంకటేశ్వర్లు అని పడుతుంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్యంగా ఏయన్నార్, శివంగా యన్టీఆర్ నటించారు. ఈ సినిమా కూడా వసూళ్ల వర్షం కురిపించింది. కానీ, రన్నింగ్ లో అంతగా సాగలేకపోయింది. 

చెరిగిపోని చరిత్ర
ఇలా ఇద్దరు సమకాలికులైన అగ్రశ్రేణి కథానాయకులు కలసి 15 చిత్రాలలో నటించడం అరుదైన విషయం. "ప్రపంచంలోనే ఈ అరుదైన రికార్డు మాకే దక్కింది" అంటూ ఏయన్నార్ ఎన్నో వేదికలపై గొప్పగా చెప్పుకొనేవారు. యన్టీఆర్ మరణానంతరం ఆయన పేరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'యన్టీఆర్ నేషనల్ అవార్డు'ను తొలుత అందుకున్న నటుడుగా ఏయన్నార్ చరిత్రలో నిలచిపోయారు. ఈ ఇద్దరు మహానటులు స్వరాష్ట్రంలో చిత్రపరిశ్రమ అభివృద్ధికై ఎంతగానో పాటు పడ్డారు. స్టూడియోస్ కట్టారు. యన్టీఆర్ థియేటర్లనూ నిర్మించారు. వారు చూపిన బాటలోనే ఈ నాటికీ ఎంతోమంది నటీనటులు సాగుతూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. అందుకే తెలుగు చిత్రసీమకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది మూడో కన్నుగా మరికొందరు నటుల పేర్లు ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఆ నటులు చిత్రసీమలో మేటి నటులుగా రాణించారే తప్ప , చిత్ర సీమ అభివృద్ధికి పాటు పడిన దాఖలాలు లేవు. అలా రామారావు, నాగేశ్వరరావును చిన్నబుచ్చే ప్రయత్నం చేసేవారి అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవాలే తప్ప వాదించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలతోనే తెలుగుసినిమా ఓ వెలుగు వెలిగింది అన్న సత్యం చరిత్రనే చెబుతోంది. దానిని ఎవరూ చెరిపేయలేరు కదా!