ఎన్నికలే లక్ష్యంగా.. ఆ రెండు సినిమాలు..!!
ఎన్టీఆర్ బయోపిక్ జులై 5 న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పాత్రలో ఉన్న బాలకృష్ణను ఓ సైడ్ గా చూపిస్తూ.. ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ లుక్ చూస్తుంటే.. మనదేశంలోని ఎన్టీఆర్ పాత్ర గుర్తుకు వస్తుంది. ఆ సినిమా ద్వారానే ఎన్టీఆర్ చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇక ఇందులో ఎన్టీఆర్ సినిమా జీవితం గురించే కాకుండా.. రాజకీయజీవితం గురించి కూడా ఉంటుందని టాక్. సినిమా జీవితంలో ఎన్టీఆర్ కు తిరుగులేదు. ఎటువంటి మచ్చలేదు. అయితే, రాజకీయ రంగం గురించే ఎలా చూపబోతున్నారు అన్నది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న అంశం.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర సినిమా రాబోతున్నది. ముఖ్యంగా ఇందులో వైఎస్సాఆర్ పాదయాత్ర గురించే ఉంటుంది. పాదయాత్ర సమయంలో ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం, ప్రజలతో మమేకం కావడం.. ప్రజాసమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలు ఉండొచ్చు. వీటి గురించే యాత్ర సినిమాలో ఎక్కువ ప్రస్తావించి ఉంటారని సమాచారం. వైఎస్సాఆర్ జయంతి రోజున అంటే జులై 8 న యాత్ర టీజర్ రిలీజ్ చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అటు ఎన్టీఆర్, ఇటు రాజశేఖర్ రెడ్డిలు రాజకీయ రంగంలో విశేషమైన కృషి చేసిన వ్యక్తులే. అంతేకాదు, వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకొని ఈ రెండు సినిమాలు తీస్తున్నారని ఓ టాక్. ఎన్నికల సమయానికి ఈ రెండు సినిమాలు రిలీజ్ చేసి.. వీలైనన్ని ఓట్లు సంపాదించుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రముఖ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతం అవుతుందో తెలియాలంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)