రివ్యూ: మహానాయకుడు 

రివ్యూ: మహానాయకుడు 

 

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, ఆమని, కల్యాణ్‌రామ్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, సచిన్‌ ఖేడ్కర్‌, సుప్రియ వినోద్‌, పూనమ్‌ బజ్వా, తదితరులు 

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌

నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

 

ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి సినిమాగా కథానాయకుడు జనవరి 9 న రిలీజ్ అయింది.  ఇది పూర్తిగా సినిమా రంగానికి సంబంధించిన సినిమా.  ఎన్టీఆర్ పార్టీని పెడుతున్నట్టు ప్రకటించడంతో ఆ సినిమా ముగుస్తుంది.  ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించిన సినిమాగా మహానాయకుడును తెరకెక్కించారు.  ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.  మరి ఆ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం. 

కథ

కథ అందరికి తెలిసిందే.  ఎన్టీఆర్ పార్టీని స్థాపించడం.  పార్టీని స్థాపించిన వెంటనే ప్రజల్లోకి వెళ్లి.. ప్రజల సమస్యలను తెలుసుకొని ఎన్నికల్లో పోటీ చేసి 9 నెలల్లోనే అధికారంలోకి వస్తారు.  అప్పటికే కేంద్రంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది.  ఆయా పార్టీలను ఎలా ఎదుర్కొన్నారు.  కేంద్రంలో ఇందిరాగాంధీ నిరంకుశ ప్రభుత్వం కొనసాగుతుంటుంది.  నిరంకుశ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొన్నారు.. తన వెంటే ఉంది తనను రాజకీయంగాదెబ్బతీసేందుకు ప్రయత్నించినా వాళ్ళు ఎవరు వాళ్ళను ఎలా ఎదుర్కొన్నారు అన్నది మిగతా కథ. 

విశ్లేషణ: 

ఈ సినిమాను ఒక కథలా కాకుండా రాజకీయ కోణంలో విశ్లేషించి చూసినపుడు మహానాయకుడు కథ అర్ధం అవుతుంది.  సినిమా రంగంలో అగ్రస్థాయిలో ఉన్న ఓ నటుడు రాజకీయ పార్టీని స్థాపించడం మాములే. చాలా సందర్భాల్లో ఇలా జరిగింది.  పార్టీని స్థాపించి.. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేసి.. అధికారంలోకి తీసుకురావడం అనే విషయం అనిర్వచనీయం.  పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తరువాత... నిధుల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై చేసిన పోరాటాలు అబ్బురపరుస్తాయి.  తెరపై చూస్తే చూపిస్తున్నదంతా నిజమేనా అని అనిపిస్తుంది.  బయోపిక్ సినిమా కాబట్టి నిజమనే చెప్పాలి.  ఇక ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును తగ్గించడం ఒక సాహసోపేతమైన నిర్ణయం.  ఆ నిర్ణయం తరువాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు అనే విషయాన్ని తెరపై చూపించారు.  పదవీవిరమణ వయస్సు ఎందుకు తగ్గించాల్సి వచ్చింది.  ఆ తరువాత ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది అనే విషయాను చూపించిన తీరు బాగుంది.  తాను నమ్మిన నాదెండ్ల భాస్కరరావు ఎలా మోసం చేశాడు? సీఎం కుర్చీ కోసం ఎలాంటి ఎత్తులు వేశాడో సినిమాలు అద్భుతంగా చూపించారు.  కుట్రలు కుతంత్రాలను గురించి సెకండ్ హాఫ్ లో ఆసక్తిగా మలిచాడు క్రిష్.  అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది.  దానికి గల కారణాలు ఏంటి..? అనే వాటిని చూపించిన తీరు బాగుంది.  సెకండ్ హాఫ్ అంతా కూడా నాదెండ్ల భాస్కర రావు ఎపిసోడ్ చుట్టూనే తిరుగుతుంది.  ఎన్టీఆర్ కు జరిగిన అవమానాలు, ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకెళ్లి బలనిరూపణ చేయడం.. వంటివి రక్తికట్టించాయి.  ఒకవైపు రాజకీయ కోణాన్ని ఆవిష్కరిస్తూనే.. బసవతారకంతో ఉన్న అనుబంధం గురించి కూడా చూపించారు. సినిమా అంతా బసవతారకం కోణంలోనే సాగుతుంది కాబట్టి, ఆమె మరణంతో కథ ఎండ్ అయింది.  

నటీనటుల పనితీరు: 

మహానాయకుడిగా బాలకృష్ణ వందకు వందశాతం న్యాయం చేశాడు.  ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు.  మాములుగా బాలకృష్ణ సినిమాల్లో ఆవేశం, డైలాగులు ఓవర్రైడ్ చేస్తుంటాయి.  అలా జరగకుండా సమతూకం పాటించాడు.  రాజకీయ నాయకుడిగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనే విధానంలో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ.. భర్తగా బసవతారకం దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటూ.. రెండు కోణాల్లో ఒదిగిపోయి కనిపించాడు.  మహానాయకుడులో విద్యాబాలన్ పాత్ర చాలా భావోద్వేగంగా ఉంటుంది.  విద్యాబాలన్ ఆ భావోద్వేగాలను పలికించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. చంద్రబాబుగా రానా మెప్పించాడు.  హావభావాలను, మాటలను పలికించిన తీరు బాగుంది.  అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్ ను ఒక్క సీన్ కు మాత్రమే పరిమితం చేశారు.  అటు హరికృష్ణ పాత్రను చేసిన కళ్యాణ్ రామ్ కూడా అక్కడక్కడా మాత్రమే కనిపించాడు.  మిగతా నటులు వారి పరిధిమేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

కథానాయకుడులో చేసిన తప్పులను ఈ సినిమాలో జరగకుండా సరిద్దుకొని ప్రతి సన్నివేశాన్ని ఆసక్తిగా మలిచే ప్రయత్నం చేసిన క్రిష్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి.  సన్నివేశాలను ఎలా రక్తి కట్టించాలో.. ఎక్కడ భావోద్వేగంతో కూడిన సన్నివేశాలను ఎలా చూపించాలో అలా చూపించాడు క్రిష్.  బుర్రా సాయిమాధవ్ డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి.  ముఖ్యంగా హాస్పిటల్ ఎపిసోడ్.  ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అదనపు ఆకర్షణ.  ఎన్.బి.కే ఫిలిమ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

ఎమోషనల్ సీన్స్ 

పొలిటికల్ డ్రామా 

స్క్రీన్ ప్లే 

నెగెటివ్ పాయింట్స్: 

పెద్దగా లేవు 

చివరిగా : మహానాయకుడు.. మెప్పించాడు.