40 ఏళ్ళ 'గజదొంగ'

40 ఏళ్ళ 'గజదొంగ'

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు ద్విపాత్రాభినయం చేసిన 'గజదొంగ' చిత్రం జనవరి 30తో 40 ఏళ్ళు  పూర్తి చేసుకుంటోంది. నటరత్న యన్టీఆర్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు  కాంబినేషన్ లో తెరకెక్కిన 'గజదొంగ' అభిమానులను ఆనంద సాగరంలో మునకలేయించింది. సగటు ప్రేక్షకులకు కూడా పరమానందం పంచింది.

'గోల్డ్ మేన్'గా యన్టీఆర్!
'గజదొంగ' సినిమా అనగానే అందరికీ ముందుగా అందులో యన్టీఆర్ 'గోల్డ్ మేన్'గా అలరించిన తీరు గుర్తుకు వస్తుంది. కథ విషయానికి వస్తే, గోల్డ్ మేన్'ను పట్టుకోవాలనుకొనే పోలీసాఫీసర్ తనయుడు రాజాకు, గోల్డ్ మేన్ కు దగ్గర పోలికలు ఉంటాయి. దాంతో ఆ బంగారు దొంగ సునాయాసంగా దొంగతనాలు చేసేస్తూ ఉంటాడు. అతణ్ని పట్టుకోవాలని ఓ స్పెషల్ ఆఫీసర్ వస్తాడు. అతని చెల్లెలిని రాజా ప్రేమిస్తాడు. గోల్డ్ మేన్ మనిషి చేతిలో రాజా తండ్రి పోలీసాఫీసర్ మరణిస్తాడు. అప్పుడు రాజా కన్నతల్లి ద్వారా తనకు ఓ అన్న ఉన్నాడని తెలుస్తుంది. అతనే గోల్డ్ మేన్ అని తెలుసుకుంటాడు. అసలు అతను దొంగగా ఎలా మారాడు అన్నది కూపీలాగి, చివరకు అసలు దోషులను మట్టుపెట్టడంతో కథ సుఖాంతమవుతుంది.. ఇందులో గోల్డ్ మేన్ కృష్ణగా, రాజాగా యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. చివరి సన్నివేశాల్లో యన్టీఆర్ ముగ్గురిగానూ కనిపించి వినోదం పంచారు. 

మేటి తారాతోరణం...
ఆ రోజుల్లో యన్టీఆర్ తో సినిమా నిర్మించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. ఆయన పారితోషికమే అత్యధికంగా ఉండేది. అందువల్ల కొందరు నిర్మాతలను కలిపి, ఓ సినిమా తీసుకోమని కాల్ షీట్స్  ఇచ్చేవారు. అలా ఈ చిత్రాన్ని నటుడు కైకాల సత్యనారాయణ  తమ్ముడు కె.నాగేశ్వరరావు,, మరో ప్రముఖ నిర్మాత చలసాని గోపి కలసి  నిర్మించారు, మరో నిర్మాత జి.వెంకటరత్నం సహనిర్మాతగా వ్యవహరించారు. విజయదుర్గా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. 
నాటి మేటి తారలతో 'గజదొంగ' రూపొందింది. ఇందులో జయసుధ, శ్రీదేవి నాయికలు కాగా, రావు గోపాలరావు మెయిన్ విలన్ గా నటించారు. మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, గుమ్మడి, కాంతారావు, పి.ఎల్.నారాయణ, పుష్పవల్లి, పండరీబాయ్, మమత, చలపతిరావు అభినయించారు. జయమాలిని ఓ పాటలో తళుక్కుమంది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన చక్రవర్తి అతిథి పాత్రలో అలరించారు.
'గజదొంగ' చిత్రానికి సత్యానంద్ రచన చేశారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశారు. కె.ఎస్. ప్రకాశ్ కెమెరా పనితనం కూడా చిత్రానికి ఓ ఎస్సెట్ గా నిలచింది.

బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన 'గజదొంగ'
 'గజదొంగ' టైటిల్ కు తగ్గట్టుగానే ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. చూసిన వారే మళ్ళీ మళ్ళీ చూసేలా చేసుకున్నాడు. మొదటి వారం ఈ సినిమా రికార్డు స్థాయిలో రూ.34 లక్షలు పైగా వసూలు చేసింది. ఇక ఫుల్ రన్ లో కోటి రూపాయలు పోగేసింది. ఈ సినిమా కంటే ముందు వచ్చి  విజయం సాధించిన చిత్రాలు టోటల్ రన్ లోనూ ఆ స్థాయి వసూళ్ళు చూడలేకపోయాయి. ఈ చిత్రం తరువాత వచ్చిన 'ప్రేమాభిషేకం' మినహాయిస్తే 'గజదొంగ' దరిదాపుల్లో నిలచిన సినిమా మరొకటి కనిపించలేదు. మళ్ళీ యన్టీఆర్ 'కొండవీటి సింహం' వచ్చే దాకా తక్కువ రోజుల్లో ఎక్కువ మొత్తం చూసిన సినిమాగా 'గజదొంగ' నిలచే ఉంది. 

ఆకట్టుకున్న అంశాలు
'గజదొంగ' చిత్రానికి యన్టీఆర్ డ్యుయల్ రోల్ పెద్ద ఎస్సెట్. నటరత్న ద్విపాత్రాభినయం చేస్తే చాలు వినోదం పరిమళిస్తుంది. కేవలం ఎంటర్ టైన్ చేయడానికే అన్నట్టుగా కాకుండా పాత్రలకు తగ్గ అభినయాన్ని యన్టీఆర్ ప్రదర్శించేవారు. అంతేకాదు, ఓ పాత్రలా మరో పాత్ర మెలగకుండా జాగ్రత్త పడేవారు. ఇందులోనూ నందమూరి నటన అదే తీరున సాగింది. రావు గోపాలరావు ఇందులో 'బాబాయ్' పేరుతో పంచిన వినోదం కూడా అలరించింది. అల్లు రామలింగయ్య  డిటెక్టివ్ భయంకర్ గా చేసిన కామెడీ నవ్వులు పూయించింది. శ్రీదేవి, జయసుధ అందం, చందం అలరించాయి. జయమాలిని ఐటమ్ సాంగ్ భలేగా మురిపించింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు చక్రవర్తి పోలీస్ గా కనిపించి కామెడీ పండించారు. ఇలాంటి కమర్షియల్ అంశాలన్నీ మేళవించి, రాఘవేంద్రరావు అందించిన 'గజదొంగ' శతదినోత్సవాలు, రజతోత్సవాలు చేసుకుంది. 

పాటల పందిరి వేసిన 'గజదొంగ'
ఇందులోని ఏడు పాటలూ జనాన్ని కట్టి పడేశాయి. యన్టీఆర్, శ్రీదేవితో తెరకెక్కిన "అల్ల నేరేడు చెట్టుకాడ..", "ఇదోరకం దాహం..." పాటలు పరవశింప చేశాయి. యన్టీఆర్, జయసుధపై రూపొందిన "ఇంద్రధనసు చీరకట్టి...", "చుప్పనాతి చందురుడు..." పాటలు అలరించాయి. అటు జయసుధ, ఇటు శ్రీదేవి ఇద్దరి మధ్యన యన్టీఆర్ తో చిత్రీకరించిన "ఒక రాతిరి... ఒక్క పోకిరి..." పాట కనువిందు చేసింది. ప్రేమలో మోసపోయి, భగ్నప్రేమికునిగా మారిన యన్టీఆర్ పై తీసిన "రెండక్షరాల ప్రేమ... రెండుక్షణాల ప్రేమ..." గీతం మనసులు తాకింది.  

వాళ్ళిద్దరితో రాఘవేంద్రరావు ఐటమ్స్.!
యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తొలి సినిమా 'అడవిరాముడు'.ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో వేరే చెప్పక్కర్లేదు. ఆ తరువాత నుంచీ యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన "సింహబలుడు, కేడీ నంబర్ వన్, డ్రైవర్ రాముడు, వేటగాడు" చిత్రాలన్నిటా జయమాలిని ఐటమ్ సాంగ్ ప్రత్యేకం. అదే తీరున ఈ చిత్రంలోనూ జయమాలిని ఐటమ్ సాంగ్ చోటు చేసుకుంది. సినిమాలో మొదటి పాటగా జయమాలిని ఐటమ్ సాంగ్ "నీ ఇల్ల బంగారం కాను..." అంటూ వస్తుంది. ఆ రోజుల్లో అభిమానులను కుదురుగా కూర్చోనీయలేదు ఈ పాట.
 యన్టీఆర్ - రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన 'గజదొంగ' ఇప్పటికీ  అభిమానులకు ఆనందం పంచుతూనే ఉంది. బుల్లితెరపై ఈ సినిమా ఇప్పుడు వచ్చినా ఫ్యాన్స్  అదే తీరున చూసి ఆనందిస్తున్నారు.