ఎన్టీయార్ మూవీలో విలన్ అనేనా!?

ఎన్టీయార్ మూవీలో విలన్ అనేనా!?

త్రివిక్రమ్ మనసుకు నచ్చాలే కానీ ఎవరిని ఏ స్థాయికైనా తీసుకెళ్ళ గలడు. అతనికి నచ్చిన హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే... వీళ్ళకు నేనీ సాయం చేస్తున్నానొహో అంటూ త్రివిక్రమ్ ఎప్పుడూ ప్రచారం చేసుకోరు. తన పని తాను సైలెంట్ గా చేసేస్తుంటాడు. అలానే హీరోగా నటించి పరాజయాల బాటలో సాగుతున్న చిరకాల మిత్రుడు సునీల్ ను మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా యూ టర్న్ తీసుకునేలా చేసింది త్రివిక్రమే! 'అరవింద సమేత, అల వైకుంఠపురములో' సినిమాలలో మనకు సునీల్ లోని కమెడియన్ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టే కనిపిస్తాడు. బహుశా త్రివిక్రమ్ ఇచ్చిన సలహాతోనే కావచ్చు... 'కలర్ ఫోటో'లో సీరియస్ విలన్ గా నటించి, మెప్పించాడు సునీల్. అయితే... తన స్నేహితుడి కోసం ఓ రిస్క్ చేయడానికి త్రివిక్రమ్ సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీయార్ హీరోగా త్రివిక్రమ్ తీయబోతున్న 'అయిననూ పోయిరావలె హస్తినకు' చిత్రంలో సునీల్ నే విలన్ గా పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో ఎన్టీయార్, నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... మనకు టాలీవుడ్ లో మరో స్ట్రాంగెస్ట్ విలన్ దొరికినట్టే!