నగరంలో పెట్రోల్ బంకులు రెట్టింపు

నగరంలో పెట్రోల్ బంకులు రెట్టింపు

హైదరాబాద్ లో   పెట్రోల్, డీజిల్  బంక్ లు రెట్టింపు కానున్నాయి. ఇప్పటికే ఉన్న 600 బంకులకు మరో 600 ఔట్ లెట్స్ వచ్చి చేరనున్నాయి. తెలంగాణ రాష్ట్రం మరో 3000 బంక్ లు కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 60,000 కొత్త పెట్రోల్ బంక్ లకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో పెట్రోల్ బంకులను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ... 60,000 పైగా కొత్త బంక్ లు ఏర్పాటు కానున్నాయని పెట్రోల్ డీలర్స్ అసోషియేషన్ జాతీయ ఛైర్మెన్ ఎంపీ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో వినియోగదారులకు లాభం చేకూరుతుందని ఆయన వెల్లడించారు. కేంద్రం ప్రభుత్వం డిసెంబర్ 14 నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు డిసెంబర్ 25లోగా పెట్రోల్ బంక్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఇందుకోసం రూ.10,000 ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు.

ఇప్పటికే కొన్ని బంక్ లు సరైన అమ్మకాలు లేక ఇబ్బందులు పడుతున్నాయని రాష్ట్ర డీలర్స్ అసోషియేషన్ అభిప్రాయపడుతోంది. ఐఓసీ,బీపీసీఎల్,హెచ్ పీసీఎల్ సంస్థలే ఎక్కువ బంక్ లను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. అందులో ఐఓసీనే సుమారు 60శాతం బంక్ లను నిర్వహిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్ ఆయిల్స్, రాయల్ డచ్ షెల్ లాంటి ప్రైవేటు సంస్థలు చాలా తక్కువ షేర్ కలిగి ఉన్నాయి.