వన్డే రన్ మెషీన్స్

వన్డే రన్ మెషీన్స్

తమ ఆరాధ్య ఆటగాడి తరహాలో ఆడటమే కల అనుకుంటే ఆ ఆటగాడి రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ పోవడం రన్ మెషీన్ విరాట్ కోహ్లీకే సాధ్యమేమో. తను ఎంతగానో ఇష్టపడే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను వరుసగా బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు కింగ్ కోహ్లీ. ఇవాళ విశాఖపట్నంలో వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 10,000 పరుగులు చేసిన సచిన్ రికార్డును ఏకంగా 54 ఇన్నింగ్స్ తక్కువలోనే పూర్తి చేసి చేజ్ మాస్టర్ లిటిల్ మాస్టర్ ను దాటేశాడు. 10,000 పరుగులు చేసేందుకు సచిన్ కి 259 ఇన్నింగ్స్ పడితే కోహ్లీ 205 ఇన్నింగ్స్ లోనే ఆ మైలురాయి చేరుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ 263 ఇన్నింగ్స్ లో 10 వేల మజిలీ చేరాడు. 10,000 పరుగులకు రికీ పాంటింగ్ 266, జాక్విస్ కలిస్ 272, ఎంఎస్ ధోనీకి 273 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. 

వన్డే మ్యాచుల్లో అత్యధిక పరుగుల రికార్డు టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ మొత్తం 18,426 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్థానంలో శ్రీలంకకి చెందిన కుమార సంగక్కర (14,234), ఆస్ట్రేలియాకి చెందిన రికీ పాంటింగ్ (13,704), శ్రీలంకకి చెందిన సనత్ జయసూర్య (13,430), మహేల జయవర్థనే (12,650), పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ (11,739) ఉన్నారు. ఇక భారతీయ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్ర సింగ్ ధోనీ (10,123) పరుగులు చేశారు. మరో 7-8 ఏళ్లు ఆడగల సత్తా ఉన్న 29 ఏళ్ల కోహ్లీ  ఇదే తరహాలో పరుగుల వరద సృష్టిస్తుంటే మరో నాలుగైదేళ్లలో ఈ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంది.