కార్తీక్‌కు దారులు మూసుకుపోయినట్టేనా?

కార్తీక్‌కు దారులు మూసుకుపోయినట్టేనా?

ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్‌లకు ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ శుక్రవారం జట్లను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో వన్డే జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ఎంపికయిన జట్టే ప్రపంచకప్‌కు వెళ్లే అవకాశముంది. ఆస్ట్రేలియాతో ఆడే జట్టునే ప్రపంచకప్‌కు పంపుతామని గతంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా చెప్పాడు. ఒకవైపు ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడడం, మరోవైపు ప్రపంచకప్‌ వరకు ఎలాంటి సిరీస్‌లు లేకపోవడంతో.. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు పూర్తిస్థాయి ఆటగాళ్లను ఎంపిక చేయడం జరిగింది.

ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు అందరూ ఊహించినట్టుగానే 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది భరత సెలక్షన్‌ కమిటీ. అయితే ఒకే ఒక్క స్థానంపై గత కొద్ధి రోజులుగా జరుగుతున్న తీవ్ర చర్చకు.. ఒక్క ఎంపికతో తెరదించారు సెలక్టర్లు. కొద్ది కాలంగా మిడిలార్డర్ భారాన్ని మోసిన సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్‌ను తప్పిస్తూ కుర్రాడు రిషబ్ పంత్‌కు అవకాశం ఇచ్చారు. పంత్‌ రెండు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. దీంతో ప్రపంచకప్‌ ప్రణాళికల్లో రిజర్వ్‌ కీపర్‌గా, రిజర్వ్‌ బ్యాట్స్‌మన్‌గానూ పంత్‌ ఉన్నాడనే సంకేతాలు వచ్చాయి. దీంతో దినేశ్ కార్తీక్‌ దారులు దాదాపు మూసుకుపోయినట్టే. ఇక కార్తీక్ ప్రపంచకప్‌ జట్టులో స్థానం సంపాదించడం కష్టం.

అయితే దినేశ్ కార్తీక్‌కు దారులు మూసుకుపోలేదని ఎమ్మెస్కే ప్రసాద్‌ చెబుతున్నప్పటికీ.. అతడు ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం తక్కువే. రిషబ్ పంత్‌ ఎడమ చేతి వాటం ఆటగాడు కావడం, ఎలాంటి పరిస్థితిలోనైనా ధాటిగా ఆడే సత్తా ఉండటం పంత్‌కు కలిసొచ్చింది. ఇక బ్యాటింగ్‌ లైనప్‌లో కూడా ఎక్కడైనా ఆడగలగటం అతడికి అవకాశాలను మరింత రెట్టింపు చేశాయి.