సైకిల్ పై తల్లి మృతదేహాన్ని తీసుకువెళ్లి...

సైకిల్ పై తల్లి మృతదేహాన్ని తీసుకువెళ్లి...

ఒడిశా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కర్పాబహాల్ గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన ఓ మహిళ ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన సైకిల్ పై తల్లి మృతదేహాన్ని ఐదు కిలోమీటర్లు వరకు తీసుకెళ్లి అడవిలో ఖననం చేశాడు ఆమె కుమారుడు. వివరాల్లోకి వెళితే.. ఝీర్సీగూడ జిల్లా కర్పబహాల్ గ్రామానికి చెందిన జానకి అనే మహిళ ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోవడంతో పుట్టింట్లోనే ఉంటూ కొడుకును చదివించుకుంటోంది. బుధవారం నీళ్ల కోసం బావికి వెళ్లిన జానకి... బోరు బావి కూలిపోవడంతో అక్కడిక్కడే చనిపోయింది. తన తల్లికి అంత్యక్రియలు చేయాలని గ్రామస్థుల సాయం కోరాడు. అయితే జానకికి అంత్యక్రియలు చేసేందుకు ఆ ఊరి వాళ్లెవ్వరూ ముందుకు రాలేదు. దాంతో ఏం చేయాలో తెలియక తాను బడికి వెళ్లేందుకు వాడే సైకిల్ తీసుకుని, దానిపై తల్లి శవాన్ని వేసుకుని ఊర్లోకి తీసుకెళ్లాడు. తర్వాత అదే సైకిల్ మీద అడవిలోకి తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించాడు. తన భార్య మరణిస్తే, మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేక, ఓ చాపలో ఆమెను చుట్టి, భుజానికి ఎత్తుకుని నడుస్తూ వెళ్లిన మాంఝీ ఘటన మర్చిపోవ ముందే, ఒడిశా రాష్ట్రంలో అలాంటి ఘటనే మరోకటి జరగడం విచారకరం.