ఒడిషాలో ఫానీ నష్టం రూ.12,000 కోట్లు

ఒడిషాలో ఫానీ నష్టం రూ.12,000 కోట్లు

సైక్లోన్ ఫానీ కారణంగా సుమారు రూ.12,000 కోట్ల నష్టం వాటిల్లిందని ఒడిషా ప్రభుత్వం బుధవారం ప్రకటించింది, ఫానీ తుఫానుకు రాష్ట్ర తీరప్రాంత జిల్లాల్లో 64 మంది మరణించారని, 5 లక్షలకు పైగా నివాస గృహాలకు నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇంత భారీ నష్టానికి గురైనందువల్ల విపత్తు సహాయ నిబంధనల్లో సడలింపు కోరింది. సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పునరావాస చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ మేరకు తుఫాను ప్రభావిత నష్టంపై రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. ప్రభుత్వ ఆస్తులకు రూ.5,175 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, సహాయ పునరావాస చర్యల వ్యయం రూ.6,767.56 కోట్లయిందని తెలిపింది. 

విద్యుత్ రంగానికి అత్యధికంగా రూ.1,160 కోట్ల నష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. 220కెవి, 132కెవి, 33కెవి, 11కెవి, లో టెన్షన్ పవర్ సప్లైలలో నష్టాలు ఏర్పడ్డాయి. పూరి జిల్లాలో బలంగా వీచిన ఈదురు గాలులకు 75కి పైగా టవర్లు సమూలంగా విరిగిపడ్డాయి. పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా శాఖల నష్టం రూ.587 కోట్లుగా ఉంది. ప్రకృతి విపత్తు కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. 'కేంద్ర బృందానికి కేవలం తాత్కాలిక అంచనాలపై ఆధారపడి చెబుతున్న సంఖ్యలతో నివేదిక అందజేశాం. అధికారులు ఇంటింటికి సర్వే చేపట్టిన తర్వాత ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక తయారు చేస్తుందని' ప్రత్యేక సహాయచర్యల కమిషనర్ బీపీ సేథీ చెప్పారు.