అత్తపై కోడలి ప్రతాపం

అత్తపై కోడలి ప్రతాపం

అత్త ఆస్తి కోసం ఆశపడింది. ఆమె పేరు మీద ఉన్న భూమిని తన పేరున రాయాలని అడిగింది. అత్త ససేమిరా అనడంతో అగ్గి మీద గుగ్గిలం అయ్యింది. ఈక్రమంలో మాటామాటా పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ కోడలు.. వృద్ధురాలైన అత్తను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చింది. ఈ ఘటన ఓడిశా రాష్ట్రంలోని బర్గాడ్ జిల్లా తాళపల్లి గ్రామంలో జరిగింది. పద్మావతి సాహు(75) తన చిన్న కొడుకుతో కలిసి ఉంటోంది. పద్మావతికి, ఆమె చిన్న కొడుకు భార్య బాలామతికి భూమి విషయంలో ఎప్పటి నుంచో గొడవ జరుగుతోంది. ఈక్రమంలో ఇంటి బయట కుర్చున్న పద్మావతిని బాలామతి నానా మాటలూ అంది. పద్మావతి ఎదురుచెప్పడంతో బాలామతికి కోపం కట్టలు తెంచుకుంది. ఒక్క ఉదుటన పద్మావతిని జుట్టు పట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకెళ్లింది. అందరూ చూస్తుండగానే చితకబాదింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు బాలామతిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు.