ఓం బిర్లా రాజకీయ ప్రస్థానం.. ఆసక్తికరం..

ఓం బిర్లా రాజకీయ ప్రస్థానం.. ఆసక్తికరం..

కొత్తగా కొలువుదీరిన లోక్‌సభకు సభాపతిగా బీజేపీ ఎంపీ ఓం బిర్లా దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికవబోతున్నారు. రాజస్థాన్‌లోని కోట-బుండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓం బిర్లా అంచెలంచెలుగా ఎదిగారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలిచిన ఆయన.. కేంద్రంలో పలు కీలక కమిటీలకు ఛైర్మన్‌గానూ వ్యవహరించారు.

రాజస్థాన్‌లోని కోటలో 1962 నవంబర్‌ 23న జన్మించిన ఓం బిర్లా.. ఎం కామ్‌ చదివారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1991 నుంచి 12 సంవత్సరాలపాటు బీజేవైఎంలో కీలక నాయకుడిగా పని చేశారు. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 2003లో కోటా సౌత్ అసెంబ్లీ స్థానంలో గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

2014లో కోట-బుండి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచిన ఓం బిర్లా.. గత ఎన్నికల్లో కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌ నారాయణ్‌ మీనాపై 2.79 లక్షల మెజార్టీతో గెలుపొందారు.