అత్త, మేనల్లుడు కలసి బెంగాల్ ను నాశనం చేశారు

అత్త, మేనల్లుడు కలసి బెంగాల్ ను నాశనం చేశారు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని చారిత్రక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో 23 రాజకీయ పార్టీల నేతలు ర్యాలీ నిర్వహించిన దాదాపు మూడు నెలల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), లెఫ్ట్ పార్టీల  'గూండా రాజ్యం' నుంచి బెంగాల్ ప్రజలను విముక్తులను చేస్తానని వాగ్దానం చేశారు. 

జనవరి 19న టీఎంసీ నిర్వహించిన 'యునైటెడ్ ఇండియా' ర్యాలీపై ప్రధాని మోడీ విమర్శలు రువ్వారు. కేవలం 'మోడీ హటావ్, మోడీ హటావ్' అని నినదించేందుకే వివిధ రాష్ట్రాల నుంచి నేతలు బెంగాల్ లో గుంపు కట్టారని ఎద్దేవా చేశారు.

'మోడీ ఏం పాపం చేశాడు? నిరుపేదలకు ఉచితంగా మరుగుదొడ్లు కట్టించడం పాపమా? పేదలకు వంటగ్యాస్ ఇవ్వడం నేరమా?' అని ప్రధాని ప్రశ్నించారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎంపీ అభిషేక్ బెనర్జీలపై నేరుగా దాడి చేస్తూ తమ కనుసన్నల్లో రాష్ట్రాన్ని నడుపుతూ మేనత్త, మేనల్లుడు సర్వనాశనం చేశారని విమర్శించారు. బెంగాల్ లో ఈ తప్పుడు పాలనను బీజేపీ పెకలించి వేస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాల్ లో ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 'మమతా బెనర్జీ ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయలేదు. కానీ మేం త్రిపురలో అధికారంలోకి రాగానే చేసి చూపించాం' అని చెప్పారు.

మోడీని ద్వేషించే కొందరు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ప్రధాని ఆరోపించారు. '(పాకిస్థాన్ పై) ఎయిర్ స్ట్రైక్ పై అనుమానాలు వ్యక్తం చేసిందెవరు? మన సాయుధ దళాల నైతిక స్థైర్యం దెబ్బ తీసిందెవరు? చనిపోయిన ఉగ్రవాదు శవాల సంఖ్య అడిగిందెవరు?' అని ప్రశ్నించారు. 

బుజ్జగింపు విధానంలో భాగంగా కాంగ్రెస్ ఉగ్రవాదానికి తన తల వంచుతోందని విమర్శించారు. ఆ పార్టీ జాతీయ భద్రతతో రాజీపడిందని ఆరోపించారు. 'తమ మేనిఫేస్టోలో కాంగ్రెస్ ఏఎఫ్ఎస్పీఏలో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఇది పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులకు సాయపడుతుంది. దేశంలో అస్థిరత తెచ్చేందుకు కాంగ్రెస్ నిశ్చయించుకుందని' మోడీ అన్నారు.

ఈ ఉదయం సిలిగురిలో ఒక ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని మోడీ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రాభివృద్ధి మార్గంలో స్పీడ్ బ్రేకర్ గా మారారని విమర్శించారు. 'మేము మిగతా రాష్ట్రాల్లో మాదిరిగా పశ్చిమ బెంగాల్ లో వేగంగా అభివృద్ధి పనులు చేపట్టని మాట నిజమే. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లో దీదీ (మమతా బెనర్జీ) అనే ఒక స్పీడ్ బ్రేకర్ కారణంగానే పనులు చేయలేకపోయామని' చెప్పారు.