ప్రభాస్ ఒకే ఒక్కడు!

ప్రభాస్ ఒకే ఒక్కడు!

'బాహుబలి', 'సాహో' చిత్రాలకై సంవత్సరాల తరబడి పనిచేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏకంగా మూడు చిత్రాలను లైన్ లో పెట్టేశాడు. విశేషం ఏమంటే... ఈ మూడు సినిమాల షూటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న'ఆదిపురుష్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ప్రభాస్ ఓ విల్లా తీసుకుని అందులోనే ఉంటున్నాడు. మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చిత్ర బృందం అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలూ తీసుకునే షూటింగ్ చేస్తోంది. 

'ఆదిపురుష్' సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని వచ్చే వారం ప్రభాస్ 'రాధేశ్యామ్' చివరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ రాబోతున్నాడు. దీనితో 'రాధేశ్యామ్' ప్యాచ్ వర్క్ తో సహా మొత్తం పూర్తయిపోతుంది. ఈ పాన్ ఇండియా మూవీని జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. అలానే... ఆ తర్వాత ప్రభాస్ 'సలార్' షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్' కోసం గుజరాత్ లో భారీ సెట్ ను వేశారు. అందులోనే ఈ మూవీ షూటింగ్ జరుగబోతోందట.

విశేషం ఏమంటే... ఈ మూడు సినిమాలతో పాటు ప్రభాస్... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీనీ చేయబోతున్నాడు. ఒకరకంగా చూస్తే... ఇన్ని వైవిధ్యమైన పాత్రలను, కథలను గతంలో ప్రభాస్ ఎప్పుడూ ఎంపిక చేసుకోలేదు. 'ఆదిపురుష్' మైథలాజికల్ త్రీడీ మూవీ కాగా, 'రాధేశ్యామ్' వింటేజ్ రొమాంటిక్ డ్రామా. ఇక 'సలార్' ఇవాళ్టి సమాజానికి సంబంధించిన యాక్షన్ మూవీ. అమితాబ్ ప్రధాన పాత్రధారిగా దీపికా పదుకునే నాయికగా ప్రభాస్ చేయబోతున్న నాగ అశ్విన్ సినిమా ఈ మూడింటికీ భిన్నమైన సైన్స్ ఫిక్షన్ డ్రామా! ఇందులో 'సలార్' వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల కాబోతుండగా, 'ఆదిపురుష్' 2022 ఆగస్ట్ 13న జనం ముందుకు రానుంది. మొత్తం మీద భారతదేశంలోని తోటి స్టార్ హీరోలు ఎవరూ చేయని విధంగా భిన్నమైన చిత్రాలు చేస్తున్న వ్యక్తి ప్రభాస్ ఒకే ఒక్కడు అంటే అతిశయోక్తి కాదు!