అమెరికా వీసా కోసం హైదరాబాద్‌కు.. ఫుడ్‌పాయిజన్‌తో బాలుడు మృతి

అమెరికా వీసా కోసం హైదరాబాద్‌కు.. ఫుడ్‌పాయిజన్‌తో బాలుడు మృతి

అమెరికా వీసా కోసం హైదరాబాద్ వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. బుడిబుడి అడుగులేస్తూ అల్లరి చేస్తూ.. ఆనందాలు నింపే రెండేళ్ల పసివాడు విహాన్‌ కన్నుమూశాడు. ఫుడ్ పాయిజన్ చిన్నారి ప్రాణాల్ని మింగేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ముఠాపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏటుకూరి రవినారాయణ కుటుంబం బెంగుళూరులో నివాసముండేవారు. బెంగుళూరులోని ఇమేజిన్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీలో జాబ్ చేసే రవినారాయణకు అమెరికాలో జాబ్ వచ్చింది. కంపెనీ తరపున అమెరికాకు వెళ్లాల్సి ఉండగా.. వీసా స్టాంపింగ్ కోసం భార్యా, పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు రవినారాయణ. 

బేగంపేట్ లోని మానస సరోవర్ హోటల్లో బస చేశారు. పన్నీర్ కర్రీతో రోటీని ఆర్డర్ చేశారు. తిన్న కాసేపటికే వారికి కడుపునొప్పితో వాంతులు మొదలయ్యాయి. తోటివారు గమనించి రవినారాయణతో పాటు.. అతని భార్య శ్రీవిద్య, ఇద్దరు పిల్లల్ని బేగంపేట్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండేళ్ల కుమారుడు విహాన్ మృతి చెందాడు. ఏడేళ్ల కుమారుడు వరుణ్ తో పాటు.. దంపతులిద్దరూ అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. హోటల్ సిబ్బంది మాత్రం తమకేం పట్టనట్టు వ్యవహరించారని.. చికిత్స కోసం కనీసం ఆసుపత్రికి పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోతున్నారు బాధిత కుటుంబీకులు. ఇక, బాలుడు విహాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు. బాలుడి మృతికి కారణాలేంటనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని అంటున్నారు పోలీసులు.