ఒక్క రోజు...ఐదు ప్రమాదాలు !

ఒక్క రోజు...ఐదు ప్రమాదాలు !

దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో భారీ ప్రమాదాలు జరిగాయి. విశాఖలో LG పాలిమర్స్‌,  చత్తీస్‌గఢ్‌ పేపర్ మిల్లుల నుంచి విషవాయువులు వెలువడితే... తమిళనాడు, మహరాష్ట్రల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. నిన్న విశాఖ ఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్‌లో గ్యాస్ లీకేజి తీవ్ర భయాందోళనలు కలిగించింది. రాయ్‌గఢ్‌లోని ఓ పేపర్ మిల్‌లో కెమికల్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా, గ్యాస్ లీకైంది. దీంతో పేపర్ మిల్‌లో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వీళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక తమిళనాడు కడలూర్ కోల్ మైనింగ్ కంపెనీలో బాయిలర్ పేలడంతో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి.

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ప్లాంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్లాంట్‌ నుంచి భారీగా ఎగిసిపడిన పొగ...  పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానిక భయాందోళనకు గురయ్యారు. తమిళనాడు తిరుపూర్‌లోని స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో కోట్ల రూపాయలు విలువ చేసే సరుకు దగ్ధమైంది. మిల్లులో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి 10 ఫైరింజన్లు కొన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో పది మంది కార్మికులకు  గాయాలయ్యయి. ఇక మహరాష్ట్రలో ఓ కలప మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్క సారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. మంటల్ని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విశాఖలో గ్యాస్‌ లీక్‌తో సహా నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా జరిగిన ఈ ఐదు ప్రమాదాలు ఆందోళన కలిస్తున్నాయి.