పడవ ప్రమాదంలో మరో మృతదేహం లభ్యం....

 పడవ ప్రమాదంలో మరో మృతదేహం లభ్యం....

గోదావరి పడవ ప్రమాదంలో మరొకరి మృతదేహం లభించింది. దేవీపట్నం మండలం మంటూరు వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమయింది. దీంతో ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 37కు చేరింది. ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక దళ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అటు ఇంకా పద్నాలుగు మంది ఆచూకీ తెలియాల్సి ఉన్నప్పటికీ పడవ వెలికితీత ఆపరేషన్ ను నిలిపివేశారని ఒకసారి లేదు వెదుకుతున్నారని మరో సారి వార్తలు వస్తున్నాయి.

ప్రమాదం జరిగి ఇవాళ్టికి సరిగ్గా వారం రోజులు గడిచాయి. ఏడురోజుల పాటు తీవ్రంగా శ్రమించినప్పటికీ పడవ వెలికీతత చర్యలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఆపరేషన్ ఆపివేశారు. సహాయచర్యలు చేపట్టేవారికి ప్రమాదం పొంచి ఉంటుందని, బోటును వెలికి తీయడం కష్టమని అధికారులు అంటున్నారు. ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక దళ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. చ్చలూరు ప్రమాద స్థలం దగ్గరకు బయట వ్యక్తులు వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు. .ప్రమాద ప్రాంతంలో భరించలేని దుర్వాసన వస్తోందని అంటున్నారు.

వారం రోజులుగా తమవారి ఆచూకీ దొరక్క బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గరకు వచ్చే ప్రతి మృతదేహం దగ్గరకు పరుగులు పెడుతూ, కనిపించిన ప్రతి అధికారినీ బతిమలాడుతూ తమ వారి ఆచూకీ కోసం పడిగాపులు పడుతున్నారు. పడవ ప్రమాదంలో గల్లంతయి, ఇప్పటిదాకా ఆచూకీ దొరకని వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. ఏడ్చీ ఏడ్చీ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడ్డారు. అధికారులు బోటును వెలికితీయడంపై దృష్టిపెట్టడం లేదని, 144 సెక్షన్ పేరుతో అక్కడకు రానీయడం లేదని  బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.