బెదిరించి బీజేపీలో చేర్చుకున్నారుః తృణమూల్

బెదిరించి బీజేపీలో చేర్చుకున్నారుః తృణమూల్

తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 50 మందికి పైగా కౌన్సిలర్లు బీజేపీలో చేరడంపై పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ చీఫ్ మమతా బెనర్టీ స్పందించారు. బీజేపీ చెప్పినట్లు 50 మంది కౌన్సిలర్లు ఆ పార్టీలో చేరలేదని, కేవలం ఆరుగురు మాత్రమే వెళ్లారని తృణమూల్‌ కాంగ్రెస్‌ తెలిపింది. తుపాకీతో బెదిరించి మరీ బీజేపీ పార్టీ వారిని లాక్కెళ్లిందని మమతా బెనర్టీ ధ్వజమెత్తారు, ఈ మేరకు టీఎంసీ తమ అధికారిక ట్విటర్‌లో వెల్లడించింది.

‘తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్‌ అయిన ఒక ఎమ్మెల్యే మాత్రమే నిన్న భాజపాలో చేరారు. మిగతా ఇద్దరు కాంగ్రెస్‌, సీపీఎంకు చెందిన వారు. అంతేగాక.. ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే బీజేపీలో చేరారు. అది కూడా తుపాకీ గురిపెట్టి వారిని పార్టీలో చేరాలని బెదిరించారు’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. 

ఇటీవల టీఎంసీ నుంచి సస్పెండ్‌ అయిన ముకుల్‌రాయ్‌ కుమారుడు సుభ్రాన్షురాయ్‌తో పాటు, మరో ఎమ్మెల్యే తుషార్‌ క్రాంతి బెనర్జీ, సీపీఎం ఎమ్మెల్యే దేవేంద్రరాయ్‌ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఇందులో తుషార్‌ క్రాంతి బెనర్జీ తమ ఎమ్మెల్యే కాదని, ఆయన కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి అని తృణమూల్‌ కాంగ్రెస్‌ వెల్లడించింది.