అధికార పార్టీ గెలిస్తే సంఖ్యాబలమే పెరుగుతుంది

అధికార పార్టీ గెలిస్తే సంఖ్యాబలమే పెరుగుతుంది

అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి సంఖ్యా బలం ఉండి కూడా ప్రతిపక్ష పార్టీలంటే భయమెందుకని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీకి ఎమ్మెల్యేల ద్వారా మండలికి ఒక సభ్యుడిని గెలిపించుకొనే అవకాశం ఉంటే వారిని ఫిరాయింపులకు ప్రోత్సహించి ప్రజాస్వామ్య విలువలను నీరు గారుస్తున్నారని ఆయన విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలిస్తే సంఖ్యా బలం మాత్రమే పెరుగుతుందని..ప్రతిపక్ష పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన పోరాడే అవకాశం ఉంటుందని చెప్పారు. పార్టీ ఫిరాయించేవారిపై ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించకుండా టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. గిరిజనులకు రాజ్యాంగం ఇచ్చిన ఫలాలను అందజేయకుండా అడ్డుకుంటున్న టీఆర్ఎస్ పంచన చేరడానికి ఆత్రం సక్కు పోవడాన్ని అతని విజ్ఞతకే వదిలేస్తున్నట్టు చెప్పారు. 

మొత్తం రెండు లక్షల ఖాళీలు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 20 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఇంకా లక్షా 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సజావుగా నియామకం చేసిన దాఖలాలే లేవని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 2 డీఎస్సీలు పూర్తిచేసి మూడో డీఎస్సీకి సిద్ధమవుతుండగా తెలంగాణలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్ట్ వ్యవస్థను రూపుమాపుతామని చెప్పి ఇంతవరకు ఒక్కరిని కూడా క్రమబద్ధీకరించలేదని మండిపడ్డారు. పక్క రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలు చేస్తుండగా ఇక్కడ దానిపై స్పష్టతే లేదని ఎద్దేవా చేశారు.