కచ్చలూరు వద్ద మొదలయిన బోట్‌ వెలికితీత

కచ్చలూరు వద్ద మొదలయిన బోట్‌ వెలికితీత

ఆపరేషన్ రాయల్ వశిష్ట కొనసాగుతోంది. ధర్మాడి సత్యం టీమ్ గోదావరిలో బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు  చేస్తోంది. లంగర్‌కు బోటు తగలడం.. పైకి లాగే ప్రయత్నంలో రైలింగ్ రావడంతో ధర్మాడి సత్యం టీమ్‌లో ధీమా పెరిగింది. ఇవాళ విశాఖకు చెందిన డైవర్లు వస్తే లంగరు తగిలించి బోటు తీస్తామంటున్నారు. గోదావరిలో కచ్చులూరు దగ్గర మునిగిన రాయల్‌ వశిష్ట పర్యాటక బోటు వెలికితీతలో శుక్రవారం ఆశాజనక ఫలితం కనిపించింది. నదిలో వేసిన లంగరుకు బోటు రెయిలింగ్‌ తగిలింది.

తాడుతో లాగినప్పుడు రెయిలింగ్‌ ఊడి వచ్చింది. ధర్మాడి సత్యం బృందంతో కలిసి కాకినాడ పోర్టు అధికారి బోటు మునిగిన చోటుకు నాటు పడవపై వెళ్లారు. అంచనా వేసిన ప్రదేశం దగ్గర బోటు కోసం లంగరు వేసేందుకు సత్యం బృందానికి పలు సూచనలు చేశారాయన.  భారీ లంగరు తగిలించి తాడుతో లాగుతున్న సమయంలో బోటు సుమారు 12 అడుగులు ముందుకు వచ్చిందని తెలిపారు.

బోటును లాగుతున్న సమయంలో డీజిల్‌ మరకలు తెట్టుగా పైకి వచ్చాయని, ఆ ప్రాంతంలో ఎక్కువగా బుడగలు వస్తున్నాయని చెప్పారు. గోదావరిలో కేవలం 50 అడుగుల లోతులోనే బోటు ఉన్నట్లు చెబుతోంది ధర్మాడి సత్యం బృందం. ఒడ్డు నుంచి కేవలం 200 మీటర్ల దూరంలోపే బోటు ఉందని, ఇవాళ విశాఖపట్నం నుంచి కొందరు డైవర్లు పిలిపిస్తున్నామని తెలిపారు.  గోదావరి లోపలకు వెళ్లి బోటుకు సరైన విధంగా లంగరు వేసే డీప్‌ వాటర్‌ డ్రైవర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గజ ఈతగాళ్లు ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో రంగంలోకి దిగనున్నారు. కాకినాడ పోర్టు అధికారి పర్యవేక్షణలో వెలికితీత పనులు కొనసాగుతున్నాయి.