అండర్ స్క్రీన్ కెమెరా ఫోన్ తీసుకొస్తున్న ఒప్పో

అండర్ స్క్రీన్ కెమెరా ఫోన్ తీసుకొస్తున్న ఒప్పో

గత కొన్నేళ్లలో ఫోన్ కెమెరాలో చాలా మార్పులు వచ్చాయి. కెమెరాలో కొత్త కొత్త మార్పుల తర్వాత కంపెనీలు ఇప్పుడు ఫోన్ డిస్ ప్లేపై దృష్టి పెడుతున్నాయి. అన్ని కంపెనీలు తమ డివైస్ స్క్రీన్-టు-బాడీ రేషియో మిగతా వాటికంటే మెరుగ్గా ఉండాలని భావిస్తున్నాయి. ఇదే కోవలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి సంస్థ ఒప్పో ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా డిస్ ప్లే లోపలే ఉంటుంది. 

ఒప్పో ఇప్పటి వరకు పాప్-అప్ సెల్ఫీ కెమెరాలు, నాచ్ డిస్ ప్లే ఉన్న ఎన్నో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అండర్-స్క్రీన్ కెమెరా ఫోన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఒప్పో తన ఈ ఫోన్ ని షాంఘైలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్ లో ప్రదర్శించింది.

ఈ ఫోన్ లో ట్రాన్స్ పరెంట్ మెటీరియల్ ని ఉపయోగించామని ఇది రీడిజైన్డ్ పిక్సెల్ స్ట్రక్చర్ తో కలిసి పనిచేసి కెమెరాలోకి వెలుగు వచ్చేలా చేస్తుందని కంపెనీ చెప్పింది. ఫ్రంట్ కెమెరా సెన్సర్ మిగతా సెల్ఫీ కెమెరాలతో పోలిస్తే పెద్దదిగా ఉంటుందని, ఇందులో వెడల్పయిన ఆపర్చర్ లెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఒప్పో ఈ ఫోన్ స్క్రీన్ ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దింది. డిస్ ప్లేలో కెమెరా ఉన్న చోట కూడా ఫోన్ టచ్ చాలా బాగా పని చేస్తుంది. అండర్ డిస్ ప్లే కెమెరా అమర్చేందుకు ఫోన్ డిస్ ప్లే విషయంలో ఎక్కడా రాజీ పడలేదని ఒప్పో తెలిపింది. త్వరలోనే ఈ అండర్-స్క్రీన్ కెమెరా స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి లాంచ్ చేయాలని భావిస్తున్నట్టు ఒప్పో చెప్పింది.