ఆ రాష్ట్రాల్లో ఏకమవుతున్న విపక్షాలు

ఆ రాష్ట్రాల్లో ఏకమవుతున్న విపక్షాలు

బీజేపీని అధికారంలోకి రాకుండా చూసేందుకు, ఎన్డీయే వ్యతిరేక కూటమిలో ఐక్యత సాధించేందుకు కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయపార్టీలు 22వ తేదీన ఢిల్లీలో సమావేశమవుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలతో (రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరం) పాటు రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీయే వ్యతిరేక స్ట్రాటజీని రూపొందించడం.. విపక్షాల మధ్య ఐక్యత ఉందని చాటి చెప్పే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. 

ఈ సమావేశానికి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సహా.. టీఎంసీ, టీడీపీ, ఎన్సీ, డీఎంకే, జేడీ(ఎస్), సీపీఐ, సీపీఎం, ఏఏపీ, ఎస్పీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీ హాజరయ్యేందుకు అంగీకరించాయి. "సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్" అనే నినాదాన్ని ఆసరా చేసుకొని బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూసే ఎత్తుగడను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయా పార్టీలు నిర్ణయంచాయి. ఆ దిశగా డిసెంబర్, జనవరి మాసాల్లో దేశవ్యాప్తంగా 4 ప్రధాన నగరాల్లో భారీ ర్యాలీలకు నిర్ణయం జరిగే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇటీవల చనిపోయిన డీఎంకే మహానేత కరుణానిధి భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చెన్నైలో ఉంది. డిసెంబర్లో జరిగే ఆ కార్యక్రమానికి ఈ నేతలంతా హాజరవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తరువాత ఆంధ్రాలో ప్రతి జిల్లాలోనూ హోదా పోరులో భాగంగా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా "ఫైట్ ఫర్ జస్టిస్"నినాదంతో వరుస కార్యక్రమాలకు నిర్ణయించారు. ఇక జనవరి మొదటివారంలో బెంగళూరులో ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి రైతు ర్యాలీకి ప్లాన్ చేస్తున్నారు. అలాగే జనవరి 19న కోల్ కటాలో ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ భారీ ర్యాలీ తలపెట్టారు. దీనికి సోనియా, రాహుల్ లను కూడా పిలవాలని మమత యోచిస్తున్నారు. 

అయితే 22వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే.. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆమె ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా జరిగే సమావేశం కాబట్టి పార్టీ తరఫున ప్రతినిధిని పంపిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. డిసెంబర్ 11 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్న దృష్ట్యా... విపక్షాల్లో ఐక్యత సాధించినట్టయితే కేంద్రాన్ని పకడ్బందీగా ఇరుకున పెట్టవచ్చని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు.