శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. ఈ ఏడాది ఇదే తొలిసారి..!

శ్రీశైలం డ్యామ్‌కు భారీ వరద.. ఈ ఏడాది ఇదే తొలిసారి..!

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదనీరు శ్రీశైలం జలాశయంలోకి భారీగా వచ్చి చేరుతుంది. ఈ ఏడాదిలో తొలిసారి సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో అధికారులు 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసారు. ఇన్ ఫ్లోగా జూరాల జలాశయం స్పిల్వే గేట్ల ద్వారా 3,99,912 క్యూసెక్కులు నీరు చేరింది. జూరాల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 17,341 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే సుంకేసుల జలాశయం నుండి 73,216 క్యూసెక్కుల నీరు డ్యామ్ లో వచ్చి చేరుతుంది. మొత్తంగా చూసుకుంటే శ్రీశైలం జలాశయానికి 4,90,469 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. అదేవిధంగా ఔట్ ఫ్లోగా ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 29,659 క్యూసెక్కులు నీటిని వినియోగించి,  ఆ నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం నుంచి మొత్తంగా చూసుకుంటే ఔట్ ఫ్లో 5,05,199 క్యూసెక్కుల వరదనీరు విడుదల అవుతుంది. అయితే జలాశయం పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు,  ప్రస్తుత నీటి నిల్వ 213 టీఎంసీలు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే,  ప్రస్తుతం నీటిమట్టం 884.70 అడుగులుగా ఉంది. గడిచిన 24 గంటల్లో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నీటిని ఉపయోగించి,  14 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు ఆంధ్రప్రదేశ్ జెన్కో అధికారులు తెలిపారు.