కరోనాతో మరింత ఆర్థిక అసమానతలు.. అమాంతం పెరిగిన కుబేరుల సంపద..
కరోనా కాలంలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయి. పేదలు పూట గడిచేందుకు అష్టకష్టాలు పడుతుండగా.. కుబేరుల సంపద లక్షల కోట్ల రూపాయల మేర ఎగిసింది. గతేడాది మార్చిలో కరోనా వైరస్ దేశాన్ని ముట్టడించిన నాటి నుంచి దేశీయంగా 100 మంది టాప్ బిలియనీర్ల సంపద విలువ సుమారు దాదాపు 13 లక్షల కోట్ల మేర పెరిగింది. ఈ మొత్తాన్ని పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న 13.8 కోట్ల మంది పేదలకు పంచితే .. వారికి 94,045 లభిస్తుంది. కరోనా కష్టకాలాన్ని విశ్లేషిస్తూ.. అసమానత వైరస్ రిట ఆక్స్ఫామ్ రూపొందించిన నివేదికలోని భారత్ అనుబంధంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
అంబానీ సంపదతో 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు కనీసం ఐదు నెలల పాటు దారిద్ర్యం నుంచి బయటపడొచ్చని చెప్పింది. కరోనా సమయంలో గంటకు అంబానీ 90 కోట్లు సంపాదించగా అదే సమయంలో దేశవ్యాప్తంగా 24 శాతం మంది ప్రజలు నెలకు 3వేలు మాత్రమే సంపాదించగలిగారు. అంబానీ ఒక్క గంటలో ఆర్జించే ఆదాయాన్ని నైపుణ్యాలు లేని కార్మికుడు సంపాదించాలంటే ఏకంగా పదివేల సంవత్సరాలు పడుతుందని లెక్క వేసింది. ఇక అంబానీ సెకనులో ఆర్జించే ఆదాయాన్ని సంపాదించాలన్నా కనీసం మూడేళ్లు పడుతుందని పేర్కొంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆక్స్ఫామ్ ఈ నివేదికను విడుదల చేసింది. తీవ్రమైన అసమానతలను పరిష్కరించేందుకు సత్వరం చర్యలు తీసుకోకపోతే.. సంక్షోభం ముదిరే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి కాలంలో పెరిగిన టాప్ 11 దేశీ కుబేరుల సంపదపై కనీసం ఒక్క శాతం పన్ను విధించినా.. జన ఔషధి పథకానికి కేటాయింపులు 140 రెట్లు పెంచడానికి సరిపోతుంది. దాంతో పేదలు, బడుగు వర్గాలకు చౌకగా ఔషధాలు అందించవచ్చని ఆక్స్ఫామ్ స్పష్టం చేసింది. అలాగే, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పదేళ్ల పాటు లేదా ఆరోగ్య శాఖను పదేళ్ల పాటు నడిపించేందుకు సరిపోతుందని వివరించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)