ఐదు కాదు.. 500 రాఫెళ్లు కొన్నా... మేం రెడీ..!

ఐదు కాదు.. 500 రాఫెళ్లు కొన్నా... మేం రెడీ..!

బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలు భార‌త రక్షణశాఖ అమ్ములపొదిలో చేరిపోయాయి... మొత్తం 36 రాఫెళ్ల‌కు ఫ్రాన్స్‌తో ఒప్పందం చేసుకుంది భార‌త్.. వీటిలో మొద‌ట ఐదు రాఫెల్ విమానాల‌ను అప్ప‌గించారు. ఇక‌, 36 రాఫెళ్ల‌లో 30 రాఫెల్ విమానాలు ఫైట‌ర్ జెట్స్ కాగా, మ‌రో ఆరు ట్రైనీ విమానాలు ఉండ‌నున్నాయి. అయితే, ఐదు రాఫెళ్లు కాదు క‌దా.. 500 రాఫెళ్లు కొనుగోలు చేసినా తాము మాత్రం భ‌య‌ప‌డేది లేదు.. ఆందోళ‌న చెంద‌బోమంటూ మేక‌పోతు గంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తోంది పాకిస్థాన్‌. 

భార‌త్‌పై మ‌రోసారి త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కిన పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తికార్.. సైన్యానికి ఖర్చు చేసే విషయంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉందని, సైన్యానికి బడ్జెట్ కూడా అధికంగానే కేటాయిస్తోందంటూ వ్యాఖ్యానించారు.. ఇక‌, రాఫెక్ యుద్ధ‌విమానాల‌పై స్పందించిన ఆయ‌న‌..  ఫ్రాన్స్ నుంచి భారత్ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసినా.. తాము భయపడే ప్రసక్తే లేద‌ని..... అవసరమైతే తగిన స‌మాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఐదు రాఫెళ్లను కొనుగోలు చేసినా... 500 రాఫెళ్లను కొనుగోలు చేసినా ఎలాంటి ఆందోళన లేదు.. భయప‌డేది లేద‌ని చెప్పుకొచ్చాడు. ఇక‌, తమ సామర్థ్యంపై తమకు ఎలాంటి సందేహాలూ లేవ‌ని ధీమా వ్య‌క్తం చేసిన బాబ‌ర్ ఇఫ్తికార్.. తాము పూర్తిగా సంసిద్ధతతోనే ఉన్నామ‌ని ప్ర‌క‌టించాడు. మ‌రోసారి భార‌త్‌ను త‌న వ్యాఖ్య‌ల‌తో రెచ్చ‌గొట్టేలా మాట్లాడాడు బాబర్ ఇఫ్తికార్.