పాక్ అదుపులో 28 మంది ఆంధ్ర జాలర్లు

పాక్ అదుపులో 28 మంది ఆంధ్ర జాలర్లు

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన 28 మంది జాలర్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డు సిబ్బంది అదుపులోకి తీసుకుంది. చేపల వేటను జీవనోపాధిగా చేసుకున్న వీరు గుజరాత్ రాష్ట్రానికి వలస వెళ్లారు. చేపల వేటలో భాగంగా నిన్న పాక్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో వీరిని కోస్ట్ గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో 20 మంది శ్రీకాకుళం జిల్లా వాసులు కాగా, నలుగురు విజయనగరం, మరో నలుగురు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. వారిని విడిపించేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారుల ద్వారా కేంద్రానికి సమాచారం అందించారు. పాకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేశారు.