రహస్య చర్చల్లోనూ పాక్‌కు భంగపాటు..

రహస్య చర్చల్లోనూ పాక్‌కు భంగపాటు..

ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కశ్మీర్ అంశంపై 73 నిమిషాల పాటు జరిగిన రహస్య చర్చలో పాకిస్థాన్‌కు చుక్కెదురైంది. ఈ చర్చలో చైనా.. పాకిస్థాన్‌‌ను బలపరుస్తూ చేసిన వాదనకు రష్యా చెక్ పెట్టింది. భారత్‌కు అండగా నిలబడిన రష్యా.. కశ్మీర్ అంశం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని రష్యా స్వాగతించింది. భద్రతామండలిలోని మిగతా దేశాలు కూడా కశ్మీర్‌పై పాకిస్థాన్‌ వాదనను వ్యతిరేకించాయి. రష్యాతో పాటు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ కూడా భారత్‌కు మద్దతుగా నిలిచాయి. దీంతో పాక్‌కు చైనా తప్ప వేరే ఏ దేశమూ మద్దతివ్వని పరిస్థితి నెలకొంది. జమ్మూకశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్న చైనా వాదనను అన్ని దేశాలూ వ్యతిరేకించాయి.  

ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలు అమెరికా, రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్‌తో పాటు 10 నాన్ పర్మిమెంట్ దేశాలు బెల్జియం, కోట్ డివర్, డొమినికల్ రిపబ్లిక్, ఈక్వెటోరియల్ గినియా, జర్మనీ, ఇండోనేసియా, కువైట్, పెరు, పొలాండ్, సౌతాఫ్రికా మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉంది. దాంతో ఆయా దేశాలు మాత్రమే సమావేశానికి హాజరయ్యాయి. ఇండియా, పాకిస్థాన్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ముఖ్యంగా భారత్ తరపున రష్యా బలంగా వాదన వినిపించింది. ఇండియా, పాకిస్థాన్ రెండూ తమకు మిత్ర దేశాలేనని.. రెండు దేశాలతోనే సత్సంబంధాలున్నాయని రష్యా తెలిపింది. తమకు ఎలాంటి రహస్య ఎజెండాలు లేవన్న రష్యా.. 1972 సిమ్లా ఒప్పదం, 1999 లాహోర్ డిక్లరేషన్ మేరకు సమస్యను పరిష్కరించుకోవాలి. పొరుగు దేశాల మధ్య సామరస్య వాతావరణం కొనసాగేందుకు మా వంతు సాయం చేస్తామని తెలిపింది.