జైహింద్‌, వందేమాత‌రం అంటోన్న పాకిస్థాన్..!

జైహింద్‌, వందేమాత‌రం అంటోన్న పాకిస్థాన్..!

భారత్ అంటేనే మండిపడే పాకిస్థానీయులు జైహింద్, వందేమాతరం అంటున్నారు..! అదేంటి? పాకిస్థానీయులు ఇంతలా మారిపోయారా? అసలు ఏం జరుగుతోంది? అనే అనుమానం వెంటనే రావొచ్చు..! పక్కనుండి మనం ఎప్పుడూ తన్నుకున్నా...! దూరపోడు వచ్చి వేలు పెడితే మాత్రం మనం ఒక్కటే! అనే భావన ఏమైనా పాకిస్థానీయుల్లో వచ్చిందా? అనే ప్రశ్నకూడా ఉత్పన్నం కావొచ్చు. కానీ, ఏదేమైనా పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు టీమిండియాకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ నెల 30న భారత్‌తో తలపడనున్న ఇంగ్లండ్ జట్టు దారుణంగా ఓడిపోవాలి. అంటూ పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వీరు ఇంతలా ఎందుకు ? మారిపోయారబ్బా అనే అనుమానం వెంటనే రావొచ్చు..! విషయమేంటంటే.. భార‌త్ గెలిస్తేనే పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరే అవకాశాలుంటాయి. ఒక్క మ్యాచ్ వర్షంతో రద్దైనా.. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా... 30వ తేదీన ఇంగ్లండ్‌తో ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కోహ్లీసేన సెమీస్‌కు దూసుకుపోనుంది.. ఇంకా భారత్ గెలిస్తే పాక్‌ జ‌ట్టుకు కూడా సెమీస్ ఆశ‌లు సజీవంగా ఉంటాయి. అందుకే పాక్ క్రికెట్ అభిమానులు భార‌త్ గెల‌వాల‌ని కోరుకుంటున్నారు.

ఇక ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది... భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌లో మీ మద్దతు ఎవరికి? అంటూ పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ సోషల్ మీడియాలో ద్వారా ఓ ప్రశ్న వదిలారు. ఇక, నాజిర్ ట్వీట్‌కు పాక్‌ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. ఏ మాటలు అయితే వాళ్లకు నచ్చవో ఆవే ప్రముఖంగా ట్వీట్ చేస్తున్నారు... ఒకరు `జైహింద్‌` అంటే.. మరొకరు `వందేమాత‌రం`.. ఇంకొకరు `మేం మా పొరుగువారిని చాలా ప్రేమిస్తాం. మేం కచ్చితంగా భార‌త్‌కే మ‌ద్ద‌తిస్తాం` వేరొకరు `భారత్, పాకిస్థాన్ రెండూ ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఒక్కటవుతాయి`  అంటూ ఎవరి అభిప్రాయాలను వారు ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌ మాత్రం పాకిస్థానీయులతో జై హింద్, వందేమాతరం అనిపిస్తోంది.