భారత యువతిని పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్

భారత యువతిని పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్

 కాశ్మీర్ లో అధికరణం 370 రద్దు తర్వాత పాక్ భారత్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకరకంగా రెండు దేశాల మధ్య నడిచే బస్సులు రైళ్ళు కూడా నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా కూడా ఇరు దేశాలు ఈ సమస్యను హైలైట్ చేస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు ఉంటే చాలని అనుకుంటుంటారు కొంత మంది. అయితే ఈ ఉద్రిక్త సమయంలో ఏకంగా ఒక భారత యువతిని పెళ్ళాడి షాక్ ఇచ్చాడు పాక్ క్రికెటర్. 

పాకిస్థాన్ ఫాస్ట్బౌలర్ హసన్ అలీ భారతీయ యువతి షామియా అర్జూను పెళ్లాడాడు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అటు పాక్ లో ఇటు ఇండియాలో కాకుండా దుబాయ్ లో నిన్న వీరు వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని హసన్ అలీ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. తన బ్యాచిలర్ జీవితానికి ఇదే చివరి రాత్రి అని ట్వీట్ చేశాడు. ఎడారి మధ్యలో నిర్వహించిన మెహిందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా ఆయన అప్ లోడ్ చేశాడు.

ఇండియాలోని హర్యానాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్ర‌స్తుతం దుబాయ్‌లో ఉంటోంది. ఫ్లైట్‌ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న ఆమె కొన్నాళ్ల క్రితం అలీకి ప‌రిచ‌య‌మైంది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లికి దారితీసింది. ఎయిర్ హోస్టెస్‌గా ప‌నిచేస్తున్న సమయంలో ఆమె కొన్నాళ్ల క్రితం హసన్ అలీకి ప‌రిచ‌య‌మైంది. తన వివాహానికి ఇండియన్ క్రికెటర్లను కూడా హసన్ అలీ ఆహ్వానించాడు. తన పెళ్లికి ఇండియన్ క్రికెటర్లు కూడా వస్తే తనకు మరింత సంతోషంగా ఉంటుందని హసన్‌ తెలిపాడు.

మరోవైపు, హసన్ అలీకి ఇండియన్ టెన్నిస్ స్టార్, పాక్ క్రికెటర్ ను పెళ్లి చేసుకున్న  సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. 'కంగ్రాట్ హసన్ అలీ. మీరిద్దరూ జీవిత కాలం సంతోషంగా, ప్రేమాభిమానాలతో ఉండాలి.' అని ట్వీట్ చేసింది. భారతీయురాలిని పెళ్లి చేసుకున్న నాలుగో పాక్ క్రికెటర్ హసన్ అలీ కావడం గమనార్హం. ఇంతకు ముందు జహీర్ అబ్బాస్, మోహ్సిన్ ఖాన్, షోయబ్ మాలిక్ లు భారతీయ యువతులనే పెళ్లాడారు.